Sakshi News home page

T20 WC IRE Vs ENG: కంగ్రాట్స్‌ ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌​ అలా అనకుంటే చాలు!

Published Wed, Oct 26 2022 4:42 PM

T20 WC Netizens Reacts IRE Beat ENG Does-Not Say DLS Not-Spirit Of-Game - Sakshi

టి20 ప్రపంచకప్‌లో ఈసారి పరుగుల కన్నా వర్షం తన జోరు చూపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇచ్చిన వరుణుడు.. ఈసారి ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బను మిగిల్చాడు. అంతేకాదు అఫ్గానిస్తాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం ఆటంకం కలిగించే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 105/5గా ఉంది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ గెలిచినట్లు పేర్కొన్నారు.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజయాన్ని దక్కించుకున్న ఐర్లాండ్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఏదైతేనేం.. ఇంగ్లండ్‌ లాంటి టాప్‌ జట్టును మట్టికరిపించింది'' అంటూ కామెంట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా కూడా స్పందించాడు. ''కంగ్రాట్స్‌ ఐర్లాండ్‌.. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ అనేది క్రీడాస్పూర్తికి విరుద్దం అని ఇంగ్లండ్‌ అనదనే నమ్మకంతోనే ఉన్నా'' అంటూ వినూత్నంగా స్పందించాడు.

ఇంతకముందు టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మలు మన్కడింగ్‌ చేయడంపై క్రీడాస్పూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లండ్‌ నానా యాగీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అమిత్‌ మిశ్రా ఇంగ్లండ్‌ జట్టుకు కౌంటర్‌ ఇచ్చాడంటూ కొంతమంది అభిమానులు పేర్కొన్నారు.


ఇక టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్‌ పూర్తిగా సాగకుండానే ఫలితం వచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. మార్క్‌ వుడ్‌ (3/34), లివింగ్‌స్టోన్‌ (3/17), సామ్‌ కర్రన్‌ (2/31), స్టోక్స్‌ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్‌ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు.

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్‌ బట్లర్‌ డకౌట్‌ కాగా..  మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మలాన్‌ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్‌ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (1 నాటౌట్‌) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్‌ స్కోర్‌ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.

చదవండి: 'అవసరమా మనకు.. 'స్పైడర్‌'ను బ్యాన్‌ చేయండి'

IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’

Advertisement

What’s your opinion

Advertisement