వివాహేతర సంబంధంతోనే హత్య

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, సిబ్బంది  - Sakshi

అమర్నాథరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

నలుగురు ముద్దాయిల అరెస్టు...రిమాండ్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి

పుట్టపర్తి టౌన్‌: నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామంలో ఈనెల 24న జరిగిన దుద్దుకుంట అమర్నాథరెడ్డి (40) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. నలుగురు ముద్దాయిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ మాధవరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు...నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి గత 15 సంవత్సరాలుగా కుటాలపల్లి తండాకు చెందిన రామావత్‌ తిప్పేబాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె బాగోగులన్నీ అతనే చూసుకొనేవాడు.

అయితే మూడు నెలలుగా తిప్పేబాయి అదే గ్రామానికి చెందిన దుద్దుకుంట అమర్నాథరెడ్డితో సన్నిహితంగా ఉంటోంది. దీన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను నిలదీశాడు. దీంతో తిప్పేబాయి తాను అమర్నాథరెడ్డి వద్ద రూ.లక్ష తీసుకున్నానని, అందువల్లే అతనితో ఉండాల్సి వస్తోందని తెలిపింది. రూ.లక్ష తిరిగి ఇచ్చేస్తే మనం సంతోషంగా ఉండవచ్చని శ్రీనివాసరెడ్డితో చెప్పగా, తనవద్ద అంత డబ్బులేదని చెప్పాడు. అయితే తాను అమర్నాథరెడ్డితో సన్నిహితంగా మెలగడం తప్పదని ఆమె తేల్చిచెప్పింది.

దీంతో దుద్దుకుంట అమర్నాథరెడ్డిని అడ్డుతొలగించుకోవాలని భావించిన శ్రీనివాసరెడ్డి తన అనుచరులు గండ్రు వీరారెడ్డి, చవటకుంటపల్లి గ్రామానికి చెందిన మల్లెల వినోద్‌కుమార్‌తో కలిసి అమర్నాథరెడ్డి హత్యకు ప్లాన్‌ వేశాడు. ఇందుకు రామావత్‌ తిప్పేబాయి కూడా సహకరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 24 తేదీ రాత్రి 11 గంటల సమయంలో ముద్దాయిలంతా మద్యం సేవించి మోటర్‌ బైక్‌ (ఏపీ 02ఏవై 3992)పై అమర్నాథరెడ్డి పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ నిద్రిస్తున్న అమర్నాథరెడ్డిని రేషం ఆకును కత్తిరించే కొడవలితో దారుణంగా నరికి చంపారు. ముద్దాయిలు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఒక కేసులో, మల్లెల వినోద్‌ కుమార్‌ ఆరు కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

వేగంగా స్పందించిన పోలీసులు
అమర్నాథరెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు త్వరగా ఛేదించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో డీఎస్పీ వాసుదేవన్‌ సూచనలు మేరకు నల్లమాడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తన సిబ్బందితో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 27న (బుధవారం) నలుగురు ముద్దాయిలు నల్లమాడలో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కొడవలి, మోటర్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగిన రెండు రోజుల్లో కేసు ఛేదించిన డీఎస్పీ వాసుదేవన్‌, పుట్టపర్తి రూరల్‌ సీఐ రామయ్య, నల్లమాడ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, సీఐ హేమంత్‌కుమార్‌, ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు.

రాజకీయం కోణం లేదు
అమర్నాథరెడ్డి హత్య కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కావాలనే కొంతమంది స్థానిక నాయకులు దీన్ని రాజకీయం చేయాలని చూశారన్నారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఇద్దరు గతంలోనే కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. వారిపై రౌడీ షీట్‌ తెరిశామని, పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగిస్తామని ఎస్పీ వెల్లడించారు.

Election 2024

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top