
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య కొత్త చిచ్చు రాజేసింది. ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణ.. రాజకీయ దుమారానికి, ప్రమాణాల పంచాయతీకి తెరలేపింది. ఈ విషయంలో తాము నిర్దోషులమని, ప్రత్యర్థి పార్టీలదే తప్పు అంటూ మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలూ వాదోపవాదాలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల అంశంలో బీఆర్‌ఎస్ నేతలూ కల్పించుకోవడం, తమ వాదనలను సమర్థించుకునేందుకు నేతలంతా పాత అంశాలనే కొత్తగా తెరపైకి తెస్తుండటం ఆసక్తిగా మారింది. ఈటల ఆరోపణలపై భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం నుంచి ముక్కునేలకు రాయాలనే డిమాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ వెళ్లగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ.. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ విమర్శిస్తూ బీఆర్‌ఎస్ పోటాపోటీ ఆరోపణలకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఈటల టార్గెట్‌గా కాంగ్రెస్..
మునుగోడు ఉప ఎన్నిక, రూ.25 కోట్ల డీల్ ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడికి దిగింది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ విసరగా.. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పాల్వాయి స్రవంతి తదితరులు కూడా ఈటలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ఈటల రాజేందర్ గాంధీభవన్ వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటలపై తమకు గౌరవం ఉండేదని.. కానీ నైతికత మరిచి విమర్శలు చేయడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ శనివారం ఉస్మానియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసి, కాంగ్రెస్ పార్టీకి చెందిన 40లక్షల మంది కార్యకర్తల మనోభావాలను రాజేందర్ దెబ్బతీశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
రేవంత్ లక్ష్యంగా కమలనాథులు
ఇక ఈటల వ్యాఖ్యల్లో తప్పు లేదని, నిజంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీల్ కుదుర్చుకున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేరుగా రేవంత్‌పైనే విమర్శలు గుప్పించారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అని, డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని, రేవంత్ అడుగుపెడితే భాగ్యలక్ష్మి ఆలయం అపవిత్రమవుతుందని వ్యాఖ్యానించారు. ఈటల ఆరోపణలపై రేవంత్ తీవ్రంగా స్పందిస్తున్నారని, మరి తనపై రూ.18వేల కోట్ల కాంట్రాక్టులు అంటూ చేసిన ఆరోపణల సంగతేమిటని నిలదీశారు. ఇక రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ‘ఓటుకు నోటు’ కేసులో తాను డబ్బులు ఇవ్వలేదని ప్రమాణం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు.
రేవంత్‌కు ఈటలే డబ్బులిచ్చాడంటూ..
బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఈటల రాజకీయ ప్రత్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎంటర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా రేవంత్‌రెడ్డికి ఈటల రాజేందర్ రూ.25 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. ఈ విషయాన్ని పొరపాటున బయటికి చెప్పేసిన ఈటల మాటమార్చి బీఆర్‌ఎస్‌పైకి నెట్టేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన నగదు మార్పిడిపై ఆదాయ పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.