సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.
ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే..
► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్‌లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది.
► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం.
► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్‌లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది.
ద్విచక్ర వాహనాలే టాప్...
► గ్రేటర్‌లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్‌లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!)
► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!)
Comments
Please login to add a commentAdd a comment