సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆలయ ఉద్యోగులే భోళాశంకరున్ని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతీనెలా వేతనాలు పొందుతూనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ఖాళీ డబ్బాల ఆధారంగా రికార్డులు తారుమారు చేశారు. సుమారు 2.25లక్షల లడ్డూలు విక్రయించి రూ.45లక్షలు సొంతానికి వినియోగించారు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. బాధ్యుడిపై బదిలీ వేటు వేశారు.
మార్చి 13 నుంచి లడ్డూల విక్రయాలు..
మహాశివరాత్రి సందర్భంగా లడ్డూప్రసాదాల క్రయ, విక్రయాల బాధ్యతను తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అప్పగించారు. మార్చి 12 వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయించి, మిగిలిన లడ్డూల నిల్వలను ఆలయ అధికారులకు అప్పగించారు. మార్చి 13 నుంచి రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ప్రణాళిక ప్రకారం లడ్డూలు విక్రయించిన రికార్డుల్లో చూపిస్తూ వచ్చారు. స్టాక్ దాచిపెట్టారు. ఆ తర్వాత 2.25 లక్షల లడ్డూలు విక్రయించారు. లడ్డూలను భద్రపర్చే ఖాళీ డబ్బాలను ఆధారంగా చేసుకుని రూ.45లక్షలు కాజేశారు.
కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. కక్కించిన అధికారులు
రాజన్న దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేయడం భక్తుల ఆనవాయితీ. ఈక్రమంలో ఒక్కో లడ్డూ రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే, కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈనెల18 – 22వ తేదీ వరకు ఆలయం మూసివేశారు. ఈ క్రమంలో ప్రసాదాల తయారీ విభాగం సూపరింటెండెంట్ తిరుపతిరావు ప్రసాదాల క్రయ, విక్రయాల తీరు, రికార్డులు తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా డబ్బాలు పరిశీలించగా ఖాళీగా కనిపించాయి. లడ్డూలు ఏమయ్యాయని వెంకటేశ్‌ను ప్రశ్నించి విచారణ చేపట్టారు. దీంతో 2.25 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన సొమ్మును సొంతానికి వినియోగించినట్లు తెలిసిపోయింది. దీంతో బాధ్యుడి నుంచి రూ.45లక్షలు స్వాధీనం చేసుకుని రాజన్న ఖాతాకు జమ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment