వేములవాడ, హన్మకొండ కల్చరల్, రామగిరి(నల్లగొండ): ‘పరమేశ్వరా.. పాహిమాం.. శివ శివ శంకర శంభో.. శంకర’నామస్మరణతో శివాలయాలు, శైవ క్షేత్రాలు, దేవస్థానాలు మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలన్నీ పోటెత్తాయి. ఎటుచూసినా శివాలయాలు భక్త జనసంద్రంతో కిటకిటలాడాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరునికి వైభవంగా..
హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరిగాయి. సాయంత్రం 6.45గంటలకు శ్రవణా నక్షత్రయుక్త గోధూళి సింహాలగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరి అమ్మవారి కల్యాణం నిర్వహించారు. రాత్రి 12గంటలకు లింగోద్భవకాల పూజలు జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, సీపీ రంగనాథ్ తదితర ప్రముఖులు రుద్రేశ్వరునికి అభిషేకాలు చేశారు. నల్లగొండ పట్టణ శివారులోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం భక్తజనంతో కిటకిటలాడింది.
వేములవాడలో..
రాజన్నను దర్శించుకునేందుకు దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వేములవాడకు తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులచే మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. మహాజాతరను పురస్కరించుకొని ఆర్జీత సేవలను రద్దు చేసి, లఘు దర్శనాలను మాత్రమే అనుమతించారు. భక్తుల రద్దీ భారీగా ఉండడంతో క్యూలైన్‌లలో నిల్చునేందుకు ఇబ్బందులు పడ్డారు. సొమ్మసిల్లి పడిపోయిన భక్తులను ప్రథమ చికిత్స కేంద్రాలకు తరలించారు.
ఏపీలో పోటెత్తిన శైవ క్షేత్రాలు
ఏపీలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం, పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రము ఖ శైవక్షేత్రం కోటప్పకొండ, దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి లక్షలాదిమంది భక్తులతో పోటెత్తాయి. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రసిద్ధి చెందిన పంచారామాలైన దాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి గుడి యాత్రికులతో కిటకిటలాడాయి. మహానందిలో పూజలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment