‘ఇది బాధాకరమైన సంఘటన’
గుంటూరు: రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దాడికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారి మీద టీడీపీ దౌర్జన్యం చేసి, నానారకాలుగా దుర్భషలాడిన ఘటన బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా, రాక్షస పాలన ఉందా అని ప్రశ్నించారు.
నిజాయితీపరుడు, సమర్థవంతుడని పేరున్న అధికారిపై దాడి చేయడం శోచనీయమన్నారు. బాధ్యులపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారో చూడాలని అన్నారు. నందిగామ బస్సు ప్రమాద ఘటనపై ప్రశ్నిస్తే వైఎస్ జగన్ పై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎల్లకాలం ఓకే ప్రభుత్వం ఉండదన్న విషయాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి సిగ్గుంటే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మార్వో వనజాక్షిపై దాడికేసులో ఇరువర్గాలను పిలిపించి చంద్రబాబు రాజీ చేశారని ఇప్పుడు కూడా అదే చేస్తారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సైకిల్ గుర్తుపై గెలవాలని సూచించారు.