సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలు శరవేగంగా సాగుతోన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు శుక్రవారం గుంటూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గుంటూరు అర్బన్ ప్రత్యేకాధికారి కరిముల్లా షరీఫ్, గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. బాలకృష్ణన్ తో కలిసి మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎస్ఈబీ ప్రత్యేకాధికారి షరీఫ్ కి లక్ష్మణరెడ్డి అభినందనలు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఆ శాఖలు సమన్వయంగా పనిచేయాలి..
మద్య నిషేధం అమలులో భాగంగానే ఎస్ఈబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా పనిచేసి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లల్లో మద్యం దుకాణాలు తెరవనందున ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలించే ప్రమాదాన్ని పసిగట్టి నిరోధించాలన్నారు. రాష్ట్ర,జిల్లాల సరిహద్దుల్లో మద్యం అక్రమరవాణాకు పటిష్ట బందోబస్తును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను లక్ష్మణరెడ్డి కోరారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్ ల నేతృత్వంలో నాటు సారా కేంద్రాల్ని మూసేయించడం అభినందనీయమన్నారు.
('ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు')
సరికొత్త శుభ పరిణామం..
నాటు సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేంద్రాలను అప్పచెప్పారని.. ముఖ్యమంత్రి సంకల్పమే తమలో మార్పునకు కారణమని చెప్పడం సరికొత్త శుభ పరిణామంగా లక్ష్మణరెడ్డి వివరించారు. ఇలాంటి సంఘటనల ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా పూనుకొని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాల్ని మూత వేయించాలన్నారు.
రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు..
దశలవారీ మద్య నిషేధ చర్యలతో రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదని.. అలాంటప్పుడే ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నాటుసారా తయారీ, కల్తీకల్లు, గంజాయి ఇతర మత్తుపదార్ధాల ఉత్పత్తి జరగకుండా ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఈబీలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందితోనూ.. ఎక్సైజ్ శాఖ 30 శాతం సిబ్బందితో సమర్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరుశాఖల అధికారులు చెప్పారు. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ తమ శాఖల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయా శాఖల అధికారులు హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment