చంద్రబాబుకు ముద్రగడ మరో లేఖ
కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖాస్త్రం సంధించారు. కాపు రిజర్వేషన్లపై ఈసారి చావో, రేవో తేల్చుకుంటామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిపి తీరుతామని ముద్రగడ అన్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ ఉండి ఉంటే చంద్రబాబు జైల్లో ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడితే అరెస్ట్ చేశారని, ఐవైఆర్ కృష్ణారావు, వైఎస్ జగన్ పై పోస్టింగ్‌లు పెడితే అరెస్ట్‌లు చేయరా అని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు.
వచ్చే నెల 26 నుంచి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘ఛలో అమరావతి’ పేరుతో సోమవారమిక్కడ రూట్ మ్యాప్ విడుదల చేశారు. కిర్లంపూడి నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా మీదగా పాదయాత్ర కొనసాగనుంది.
ముద్రగడ లేఖ సారాంశం...‘ప్రజలతో, బీసీ నేతలతో చర్చించి 100 శాతం ఏకాభిప్రాయం తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని తమరు ఇటీవలే సెలవిచ్చారు. దేశమంతా పర్యటించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఈ చిలుక పలుకులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు, పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు?. బీసీల కోటాలో మా జాతికి వాటా ఇవ్వాలని అడగటం లేదు.
ప్రత్యేక కేటగిరి కిందే రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఇస్తామని పదేపదే మాట్లాడుతున్నారు. మా మద్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం మీకు అలవాటైంది. మూడేళ్లుగా రిజర్వేషన్లను డీఫ్రిజ్‌లో పెట్టి 2019లో మళ్లీ మా వాళ్లతో ఓట్లు వేయించుకోవాలనే మీ కుట్రను తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదు. కాపు రిజర్వేషన్లపై ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు మీ ఖ్యాతి ఖండాంతరంగా విరాజిల్లుతుంది’ అని పేర్కొన్నారు.