అన్న కోసమే.. మోకా హత్య !  

Shocking Facts In YSRCP Leader Moka Bhaskar Rao Murder Case - Sakshi

సీనియర్‌ నేత భరోసాతో ప్రాణాలు తీశారు! 

బందరులో మనకెవరూ ఎదురే ఉండకూడదు! 

నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు! 

నేరుగా ఫోన్లు చేయడానికి వీల్లేదు 

పక్కా ప్లాన్‌తో వైఎస్సార్‌సీపీ నేత మోకా హత్య 

పోలీసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘వాడు మీకే కాదు... నాకూ తలనొప్పిగా తయారయ్యాడు. ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు.. దారుణంగా మాట్లాడుతున్నాడు.. వాడిని ఎలాగైనా వేసేయాల్సిందే.. అయితే ఇప్పుడే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే చూద్దాం.. అప్పటి వరకు ఓపిక పడదాం.. ‘మనం రంగంలోకి దిగితే వాడు చావాల్సిందే. తప్పించుకున్నాడో మనందర్నీ వేసేస్తాడు..  కత్తి దించితే అక్కడే పూర్తయిపోవాలి. అందుకు మనమే ముందుండాలి. లేదంటే ఆ తరువాత అన్నీ చిక్కులే...’  

ఇదీ మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు మోకా భాస్కరరావు హత్యకు ముందు ప్రత్యర్థుల ప్లానింగ్‌లో రెండున్నర నెలల కిందట చర్చకు వచ్చిన అంశాల్లో మచ్చుకు కొన్ని.. మోకాను ఏవిధంగా హతమార్చాలనే విషయంలో బందరుకు చెందిన తెలుగుదేశం పార్టీలోని ఓ సామాజికవర్గం నాయకులు పలు దఫాలు భేటీ అయ్యారని వెల్లడవుతోంది. పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు  తెలియవస్తున్నాయి.  

రెండున్నర నెలల కిందటే..
గత ప్రభుత్వంలో మంత్రిగా కొల్లు రవీంద్ర అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మోకా భాస్కరరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాటిని తాను నిరూపించగలనని సవాల్‌ విసిరారు. దీనిపై కొల్లు రవీంద్రతో పాటు టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్ని ప్రత్యారోపణలు చేశారు. పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో మోకా భాస్కరరావు ప్రతి విషయంలోనూ అడ్డుగా వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు రెండన్నర నెలల కిందట  నిర్ణయానికి వచ్చారని సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల తరువాత హతమార్చడం మేలని కుట్రదారుల మధ్య అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మోకా జోరు పెరుగుతోందని, ఇప్పుడే అడ్డుకోకపోతే ఎన్నికల్లో సమస్యలు తప్పవని 20 రోజుల కిందట ఆరేడుగురు కలిసి చర్చించుకున్నారు. ‘మీరు జాగ్రత్తగా ప్లాన్‌ చేయండి. దెబ్బ మిస్‌ కాకూడదు. పనిపూర్తయ్యాక చెప్పండి. ఆ తరువాత వ్యవహారాలన్నీ నాకు వదిలేయండి. నేను చూసుకుంటా.. అయితే ఎక్కడా నా పేరు బయటకు రాకూడదు.. అసలు ప్రస్తావనకే రానీయొద్దు.. నా నెంబర్‌కు మీరు ఫోన్లు చేయవద్దు.. ఫలానా వారికి ఫోన్‌ చేయండి. నేను మాట్లాడతా... అని టీడీపీ ముఖ్య నాయకుడు భరోసా ఇవ్వడంతో చింతా కుటుంబీకులు మోకాను గత నెల 29వ తేదీ స్థానిక చేపల మార్కెట్‌లో దారుణంగా హతమార్చారు.  

అన్నదమ్ముల్లా...  
కొల్లు రవీంద్ర, చింతా చిన్ని అన్నదమ్ముల తరహాలో కలిసిమెలిసి ఉంటారనేది బందరు టీడీపీ నాయకులతో పాటు స్థానికులకు ఎరుకే. ప్రతి విషయాన్ని వారు చర్చించుకుంటారని, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారనేది బహిరంగ రహస్యం. అయితే మోకా హత్యకు నాలుగు రోజుల ముందు నుంచి చింతా చిన్ని, కొల్లు రవీంద్రల మధ్య ఫోన్‌కాల్స్‌ లేవు. కొల్లు పీఏల ఫోన్లకు చింతా చిన్ని ఫోన్‌ చేసి కొల్లుతో పలుమార్లు మాట్లాడుకున్నారు. గత నెల 28వ తేదీనే హత మార్చాలని చూసినప్పటికీ వీలుకాలేదు. మరుసటి రోజు స్పాట్‌ పెట్టారు. 

అన్నా పనైపోయింది! 
మోకా హత్య తరువాత 15 –20 నిమిషాల మధ్య కొల్లు పీఏకి చింతా చిన్ని నుంచి ఫోన్‌ వెళ్లింది. అన్నకు ఫోన్‌ ఇవ్వమన్న చిన్ని... అన్నా పనైపోయిందనగానే అంతా ఓకేగా అని ఫోన్‌ పెట్టేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ తరువాత కూడా వేర్వేరు నెంబర్లతో ఫోన్‌లలో సంభాషణ జరిగినట్లు విచారణలో రూఢీ అయ్యింది. దీన్నిబట్టి హత్యకు ప్రోత్సహించింది కొల్లు అనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసులో నాలుగవ నిందితుడిగా మాజీమంత్రిని చేర్చారు. హత్య తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగి పోవాలనే సూచన కూడా సీనియర్‌ నేతదేనని తేలింది.  

పాత కక్షల నేపథ్యంలో అనేలా! 
మోకా భాస్కరరావు హత్యలో చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ రక్త సంబందీకులు. వీరు వరుసగా మొదటి నిందితులు కాగా నాలుగో నిందితునిగా కొల్లు ఉన్నారు. నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా పలువురి ప్రమేయం ఉందని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసు అధికారి సాక్షికి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top