క్షమాపణలు చెప్పిన కేశినేని, బోండా ఉమా
విజయవాడ: టీడీపీ నాయకులు కేశినేని నాని, బోండా ఉమమహేశ్వరావు దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణ శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడవ చేసినవారు క్షమాపణలు చెప్పారని, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారని చెప్పారు.
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ మనిషి చనిపోయారని, దీనిపై పోలీసులు మమ్మల్ని వివరాలు కోరారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రవాణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని, వాహనంలో మెకానికల్ డిఫెక్ట్ లేదని రాసిచ్చారని చెప్పారు. పోలీసులు మళ్లీ జన్యునటీ సర్టిఫికెట్ కావాలని కోరగా, అది కూడా ఇచ్చామని తెలిపారు. ఈ విషయం వాళ్లకు అర్థం కావడం లేదని టీడీపీ నాయకులను ఉద్దేశిస్తూ అన్నారు. తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఎంపీ కేశినేని నాని పేరుతో ఆయన అనుచరుడు పట్టాభి తమపై పదేపదే ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. నిబంధనల ప్రకారమే నివేదిక ఉంటుందని స్పష్టం చేశామని, దీంతో ఎంపీని పిలిచి వివాదం సృష్టించారని చెప్పారు. తన గన్‌మెన్‌పై దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయో మీరో చూస్తారని అన్నారు. తనకు రక్షణ కల్పించిన గన్‌మెన్‌కు న్యాయం జరిగేలా చూస్తానని, తనపై ఇలాంటి దౌర్జన్యం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.
అంతకుముందు టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా రవాణ శాఖ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. రవాణ శాఖ కమీషనర్‌కు క్షమాపణలు చెప్పామని కేశినేని, బోండా ఉమా చెప్పారు.