బ్యాంకుల ఒత్తిడి: అంబానీ ఆస్తుల అమ్మకం
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది.
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఓ వైపు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న బ్యాంకుల రుణాలపై ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా.. బ్యాంకు దిగ్గజాలు సైతం కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో అనిల్ అంబానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మర్ అసెట్ సేల్ ను మరికొంత కాలం కొనసాగించాలని నిర‍్ణయించినట్టు తెలిసింది. ఈ సేల్ లో భాగంగా అంబానీ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీల రోడ్డు ఆస్తులను, సముద్రగర్భంలోని వ్యాపారాలను, ముంబై, ఢిల్లీలోని ప్రైమ్ రియల్ ఎస్టేట్ లను విక్రయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది.
ఈ డీల్స్ లో అత్యంత ముఖ్యమైనవి రెండు ఒకటి గ్రూప్ కు చెందిన ఫోన్ ట్రాన్స్ మిషన్ టవర్లను విక్రయించడం, రెండు తమ వైర్ లెస్ ఆపరేషన్లను ఎయిర్ సెల్ లిమిటెడ్ లో విలీనం చేయడం. ఒకవేళ ఈ రెండు డీల్స్ సరిపోకపోతే, వారం వ్యవధిలోనే రెండు ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్లు చేపట్టాలని గ్రూప్ కు చెందిన ఫైనాన్స్ యూనిట్లు నిర్ణయించాయి. గ్రూప్ రుణాలను మూడింతలు తగ్గించడానికి 4.5 బిలియన్ డాలర్ల(రూ.29,038కోట్లు) మేర నిధులను సమీకరించాలని అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.
కాగ, ఆర్బీఐ నుంచి వస్తున్న ఆదేశాలతో బ్యాంకులు కంపెనీ వ్యవస్థాపకులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఒత్తిడితో కంపెనీల వ్యవస్థాపకులు తమ ఆస్తులను అమ్మడానికి సిద్దమవుతున్నాయని ముంబైకి చెందిన టీసీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రి లోకప్రియ చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ ఇప్పటికే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమైందని, రుణాలను తగ్గించడానికి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
భారతదేశ చరిత్రలో ఒక కంపెనీ ఇంత పెద్దమొత్తంలో రుణ పునర్వ్యవస్థీకరణకు పాల్పడ్డం ఇదే మొదటిసారిఅని అంబానీ ఈ నెల మొదట్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. తన కంపెనీ దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెంచడానికి ప్రయత్నిస్తుందని, అలాగే రుణాలు కూడా పరి మిత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తుందన్నారు. ఆర్కామ్ కు ఇప్పటికే రూ.45వేల కోట్ల మేర రుణాలున్నాయి. అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దెబ్బకు ఈ రుణాలు భారీగా పెరిగాయి. కంపెనీ రుణాలు పెరిగిపోవడంతో షేర్లు కూడా కనీసం 60 శాతం పడిపోయాయి.