దోచుకున్న సొమ్ముతో ఇళ్లు..షికార్లు!

Thief Shocking Statement in Robbery Case - Sakshi

అమ్మవారి హుండీలో రూ.3 లక్షల కానుకలు

రైస్‌ పుల్లింగ్‌ కేసులోని ప్రధాన నిందితుడి లీలలు!

చిత్తూరు అర్బన్‌: అత్తసొమ్ము అల్లుడిదానం అంటే ఇదేనేమో. మోసం చేసి దోచుకున్న సొమ్ముతో జల్సా చేయడంతో పాటు అమ్మవారి ఆలయంలోని హుండీలో కూడా రూ.లక్షలు వేశాడు. కుటుంబ సభ్యుల్ని దేశంలోని పలు ప్రాంతాలకు టూర్లకు పంపాడు. ఇవన్నీ చేసింది గుడుపల్లెలో పట్టుబడ్డ రైస్‌పుల్లింగ్‌ కేసు ప్రధాన నిందితుడు మహదేవ లీలలివి! ఇతనితో పాటు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.1.29 కోట్ల నగదు సీజ్‌ చేయడం విదితమే. బాధితుడుగా ఉన్న తిరుపత్తూరుకు చెందిన నవీన్‌ వాస్తవానికి రూ.2.18 కోట్లు ఈ ముఠాకు విడతల వారీగా అందజేశాడు. పోలీసులు 1.29 కోట్లు, రూ.20 లక్షల విలువైన కార్లు స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన రూ.80 లక్షల వరకు రికవరీ చేయలేకపోయారు. దీనికి నిందితులు చెప్పిన లెక్కలు చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. ప్రధాన నిందితుడు మహదేవకు గుడుపల్లెలో ఉన్న తన ఇంటికి రిపేర్లు చేయించడం, మూడు ఏసీలు పెట్టడం, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) పనులు చేయించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక తనతో పాటు మిగిలిన నిందితుల కుటుంబ సభ్యుల్ని ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలకు విహారయాత్రలకు పంపించాడు. ఇందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇక వచ్చిన సొమ్ములో రూ.3 లక్షల వరకు నగదును కుప్పంలోని ఓ అమ్మవారి హుండీలో వేశాడు. అలాగే గ్రామస్తులు శబరిమలైకు వెళ్లాలంటే వారికి అన్నదానాలు చేయడంతో పాటు ఓ బస్సును ఏర్పాటుచేసి అన్ని ఖర్చులు తానే భరించి శబరిమలైకు పంపినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితులను పోలీసులు కస్టడీకు తీసుకోనున్నారు. నిందితులను 5 రోజులు పాటు కస్టడీకు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు అధికారులు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top