సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటి | A reduction in the price of land as wrong prosses | Sakshi
Sakshi News home page

సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటి

Published Sat, May 28 2016 2:09 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటి - Sakshi

సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటి

తమిళనాడులోని సత్రం భూములు స్వాహా
 
♦ అధికార పార్టీ నేతలే సూత్రధారులు, పాత్రధారులు
♦ ఎకరా రూ.13 కోట్లు ఉన్న భూమి రూ.27 లక్షలకే కైవసం
♦ రూ.1,000 కోట్ల విలువైన భూమి వేలంలో పలికింది రూ.22.44 కోట్లు
♦ భూమిని విక్రయించాలని తొలుత టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లేఖ
♦ సీఎం కార్యాలయం సహకారంతో 83.11 ఎకరాల దేవుడి మాన్యం వేలం
♦ అడ్డగోలుగా భూమి ధర తగ్గింపు
♦ కొనుగోలుదారులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులు, మిత్రబృందం
♦ తెరవెనుక ‘ముఖ్య’ నేత  కుమారుడు, మంత్రులు
 
 శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతం అత్యంత ఖరీదైన ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉంది. తాలంబూరు గ్రామ పరిధిలో రోడ్డు పక్కనే ఈ భూములున్నాయి. వీటి సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందూస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్టుమెంట్లు, రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సముద్ర తీరం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

 సాక్షి, హైదరాబాద్/చెన్నై/గుంటూరు
 సర్కారు భూములు ఆక్రమణకు గురైతే ఏం చేయాలి? అందులోనూ విలువైన దేవాలయ భూములైతే.. ఎంత జాగ్రత్త వహించాలి? కబ్జాదారులను తరిమికొట్టి వాటి కాపాడాలి కదా..! కానీ చంద్రబాబు జమానాలో అంతా రివర్స్..  భూములు కబ్జాదారుల నుంచి బడా‘బాబు’ల చేతుల్లోకి రాజమార్గంలో చేరిపోవడానికి ప్రణాళిక రచించారు. ఆగమేఘాలపై ఫైళ్లు పుట్టుకొచ్చాయి.. శరవేగంగా పరుగులు పెట్టాయి. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం... ఆ భూములను అమ్మేయాలని  అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించాడు.. ముఖ్యమంత్రి కార్యాలయం దేవాదాయ శాఖకు లేఖ రాసింది.. దేవాదాయ శాఖ వెంటనే వేలంపాటకు అనుమతించేసింది.... ఆనక రంగంలో దిగిన ముఖ్యమంత్రి సన్నిహితుడు... ఏరికోరి నియమించుకున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మరికొంతమంది అధికారపార్టీ నాయకులే ఆ భూములను వేలంలో కొనేశారు.. విచిత్రమేమిటంటే ఎకరా రూ.13కోట్లు పలికే భూమి ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మితే చాలని ఈవో చేత కూడా పలికించారు.

ఆ రేటుకూ ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ ఎకరం రూ. 27 లక్షలకు ఫైనల్ చేసేశారు. అలా చివరకు 83.11 ఎకరాల విలువైన భూములు రూ. 22 కోట్లకు అప్పనంగా అయినవారికి కట్టబెట్టేశారు. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది. ప్రభుత్వ పెద్దల డెరైక్షన్‌లో ఎవరి పాత్రను వారు యథాశక్తి రక్తికట్టించారు. గద్దల్లాంటి పెద్దల దెబ్బకు దేవుడైనా అబ్బా అనాల్సిందేనని రుజువుచేశారు... భూములు కోల్పోయిన అమరేశ్వరుడు అమరావతిలో నిస్సహాయంగా నిలబడ్డాడు... ప్రజలకు అవసరమైన ఫైళ్లపై కాకుండా ఎవరికో అవసరమైన ఫైళ్లపైనే తాను సంతకం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వాఖ్యానించడం కొసమెరుపు.

 ఐదుగురు అధికారులతో కమిటీ
 గుంటూరు జిల్లా అమరావతిలో శ్రీసదావర్తి సత్రం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రాహ్మణులకు, వేదశాస్త్రాలను అభ్యసించే పేద విద్యార్థులకు అన్నదానం నిర్వహించాలన్న లక్ష్యంతో అమరావతి జమీందారులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులు అప్పట్లో ఈ సత్రాన్ని నిర్మించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెంలో తమ పేరిట ఉన్న 72 ఎకరాలను, తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో మరో 471.76 ఎకరాలను సత్రం నిర్వహణ కోసం ఇనామ్ రూపంలో దారాదత్తం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు తాలూకాలో నావలూరు, తాలంబూరు, పడూరు గ్రామాల పరిధిలో ఈ భూములున్నాయి. ఈ భూముల విక్రయానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6న ఉత్తర్వులు (మెమో నం. 28228) జారీ చేసింది. అందులో 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. భూమి అమ్మకం జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ఎస్టేట్ సంయుక్త కమిషనర్ కృష్ణాజీరావు, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ విజయరాజు, రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, గుంటూరు డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, అమరావతిలోని సత్రం ఈవో శ్రీనివాసరెడ్డిలను కమిటీలో సభ్యులుగా నియమించారు.

 ఎకరాకు రూ.50 లక్షలేనట!
 చెన్నై సమీపంలోని తాలంబూరులో భూముల ధరలు అధికంగా ఉండడంతో తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ భూ లావాదేవీలలో ఎకరాకు బదులు గజా ల లెక్కన రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తోంది. ప్రభుత్వ ధరల ప్రకారమే అక్కడ ఎకరా భూమి రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు అక్కడ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటి స్థలం రూ.55 లక్షల వర కు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్‌లో ఎక రా భూమి ధర రూ.13 కోట్ల వరకు ఉన్న ట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీసదావర్తి సత్రం భూములు పూర్తిగా ఆక్రమణలో ఉన్నాయనే సాకుతో సత్రం ఈవో ఎకరా కేవలం రూ.50 లక్షల చొప్పున అమ్మకానికి ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ ఉన్న తాధికారులు వెంటనే ఆమోదం తెలిపారు. వేలం పాట ద్వారా ఎకరా భూమిని రూ.50 లక్షలకు అమ్మడానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించినట్టు సత్రం ఈవో శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

 వేలం పాట కాదు.. దోపిడీ బాట
 సాధారణంగా వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయిం చిన కనీస ధరకన్నా ఒక్క రూపాయి అయినా అధికంగా పోటీదారులు వేలం పాడుతుంటారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే వేలం పాటను రద్దు చేసి, మరోసారి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీసదావర్తి సత్రం భూముల అమ్మకం అంతా రివర్స్. 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న మొదటి విడత వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయిం చిన ధర ఎకరా రూ.50 లక్షలకు కొనడానికి ఎవరూ ముందు కు రాలేదని పేర్కొంటూ ఆ వేలంలో పాల్గొ న్న నలుగురిలో అత్యధిక ధరకు కొనడానికి ముందుకొచ్చిన వారికే భూములను కట్టబెట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. భూముల ధరను తగ్గిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఎకరం రూ.27 లక్షల చొప్పున  83.11 ఎకరాలను రూ.22.44 కోట్లకు కట్టబెట్టారు. వేలం పాట దక్కిం చుకున్న వారు సగం డబ్బులు అంటే రూ.11 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించారు. వేలం నిబంధనల ప్రకారం పాట జరిగిన 90 రోజుల్లో అంటే జూన్ 26లోగా తక్కిన మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

 అక్కడికక్కడే ధర తగ్గింపు
 చెన్నై సమీపంలో భూములు ఉన్నచోటే వేలం పాట నిర్వహించారు. దేవాదాయ శాఖ నియమించిన కమిటీలోని ఐదుగురు సభ్యులు వేలం పాట జరిగిన రోజు అప్పటికప్పుడు... అక్కడికక్కడే భూమి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విచిత్రం. దీనిపై దేవాదాయ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 ‘ఈ-టెండర్’ మరిచారు
 దేవాదాయ శాఖలో ప్రస్తుతం ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు ఇవ్వాలన్నా ‘ఈ-టెండర్’ విధానంలో అప్పగిస్తారు. 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేయలేదు. విలువైన భూములను అధికార పార్టీ ముఖ్యులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టే ఉద్దేశంతోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు అడ్డు చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది.

 ఎకరా రూ.6 కోట్లకుపైనే అని చెప్పినా..
 తమిళనాడులో శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతంలో ఎకరం ధర రూ.6 కోట్లకుపైగానే పలుకుతోందని, వేలంలో ఎకరం రూ.27 లక్షల చొప్పున అమ్మడమేమిటని దేవాదాయ శాఖ జాయింట్ కలెక్టర్ డి.భ్రమరాంబ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏప్రిల్ 18న సవివరమైన లేఖ రాశారు. అయితే, ఆ అధికారి వా దనను ఏమాత్రం పట్టించుకోకుండా దేవా దాయ శాఖ కమిషనర్ అనూరాధ వేలంలో పాట దక్కించుకున్న అధికార పార్టీ నేత చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు, ఆయన మిత్ర బృందం పేరిట ఏప్రిల్ 24 సేల్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.

 తెరవెనుక బడా నేతలు



 దేవాదాయశాఖ అధికారి, శ్రీసదావర్తి సత్రం భూముల తరఫున చెన్నైలో న్యాయవాదిగా వ్యవహరించిన లాయర్ చెప్పినదాన్ని బట్టి ఎకరం రూ.6 కోట్ల చొప్పున లెక్కించినా 83.11 ఎకరాలకు రూ.500 కోట్లు అవుతుంది. బహిరంగ మార్కెట్ ధర ఎకరం రూ.13 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన 83.11 ఎకరాలకు రూ.1,080.43 కోట్లు అవుతుంది. కనీసం రూ.1,000 కోట్లకు తగ్గదని అధికారులు అంటున్నారు. రూ.1,000 కోట్ల భూ దోపిడీ వ్యవహారంలో ఒకరిద్దరు అధికార పార్టీ నేతలు, సాధారణ వ్యక్తులు కనిపిస్తున్నప్పటికీ తెరవెనుక బడా నేతలే ఉన్నారని స్పష్టమవుతోంది. దేవాదాయ శాఖలోని కీలక అధికారులు ఈ దోపిడీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలాఖరులో భారీ మొత్తంలో నగదు లావాదేవీలను నిర్వహించరు. అలాంటిది కోట్లాది రూపాయలకు సంబంధించిన భూముల వేలం పాటను మార్చి 28న నిర్వహించడం ముందస్తు వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు.

 ఆ పని ప్రభుత్వం చేయలేదా?
 శ్రీసదావర్తి సత్రం భూములు పరుల అధీనంలో ఉన్నాయని, వాటిని వేలం వేయడం ద్వారా అమరేశ్వర ఆలయానికి ఆదాయం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లేఖ రాయడం పకడ్బందీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. దీనిపై వెనుకా ముందు ఆలోచించకుండా సీఎం కార్యాలయం ఆమోదం తెలపడం మరీ విచిత్రం. పొరుగు రాష్ట్రంలోని మన భూములు వివాదంలో ఉన్నాయని, వాటి విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. వివాదంలో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలుచేసి, అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకోగలరు గానీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదట. విలువైన భూములను తొలుత అనుచరుల ద్వారా కొనుగోలు చేయించి, ఆ తరువాత వాటిని సొంతం చేసుకునేందుకు ముఖ్య నేతలు భారీ కుట్రకు పాల్పడ్డారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ‘ముఖ్య’నేత కుమారుడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులు ఈ భూ దోపిడీలో భాగస్వాములని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 సత్రం భూముల చరిత్ర
 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి మహలక్ష్మమ్మ 1849లో అమరావతి దేవస్థానానికి చెన్నైలోని భూములను విరాళంగా ఇచ్చారు. చెన్నై సమీపంలోని తాళంబూరు ప్రాంతంలో 473 ఎకరాలను అమరేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించారు. భూములకు సంబంధించిన రికార్డులను గుడికి అందజేశారు. ఆ తరువాత జమీందారీ పాలన ముగిశాక 1969లో భూములను శ్రీసదావర్తి సత్రానికి కేటాయించారు. భూములు పక్కరాష్ట్రంలో ఉండడంతో వాటిపై పర్యవేక్షణ లోపించింది. 473 ఎకరాల్లో చాలావరకు ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం కోసం రాజా వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి హరిప్రసాద్ న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం అమరావతి దేవస్థానం కూడా న్యాయ పోరాటం కొనసాగించింది. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రత్యేక కమిటీ తమిళనాడుకు వెళ్లి భూములను పరిశీలించింది.

భూముల స్వాధీనంపై అప్పటి చెన్నై మేయర్ స్టాలిన్‌తో చర్చించింది. స్టాలిన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో న్యాయ పోరాటం చేయగా 2014లో దేవస్థానానికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. 473 ఎకరాల్లో 83.11 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం అనాధీనంగా(పోరంబోకు) ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమికి  తమిళనాడు ప్రభుత్వం 50 ఏళ్ల క్రితమే పూర్తిస్థాయిలో పట్టాలు ఇచ్చేసింది. కోర్టులో కేసు గెలిచాక తమిళనాడు సర్కారుతో చర్చలు జరిపి అనాధీనంగా ఉన్న 83.11 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే దీనిపై అక్రమార్కుల కన్నుపడింది. కొల్లగొట్టేందుకు భారీ కుట్ర జరిగింది. రూ.1,000 కోట్ల విలువైన భూమిని వేలంలో రూ. 22.44 కోట్లకే దక్కించుకున్నారు.
 
 471.76 ఎకరాల్లో మిగిలింది 83.11 ఎకరాలే
 తన నియోజకవర్గంలోని శ్రీసదావర్తి సత్రానికి (అమరావతి ఆలయ పరిధిలోనిది) చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. 2014 సెప్టెంబర్ 12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయి 2015 ఏప్రిల్‌లో భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అనుమతించింది. 471.76 ఎకరాల్లో ఆక్రమణలు పోను మిగిలి ఉన్న 83.11 ఎకరాలను విక్రయించేందుకు ఈ ఏడాది మార్చి 28న వేలం పాట నిర్వహించారు. వేలంలో కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ భార్య చలమలశెట్టి లక్ష్మీపార్వతి, కుమారుడు చలమలశెట్టి నిరంజన్‌బాబు, గుంటూరు జిల్లాకు చెందిన మందాల సంజీవరెడ్డితోపాటు ఎం.సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్, ఆర్.శివరామకృష్ణరావులు కలిసి 83.11 ఎకరాలను దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement