
సాక్షి ప్రతినిధులకు బాబు సర్కార్ నోటీసులు
తెలుగువారి మనస్సాక్షి సాక్షిపై ఏపీ ప్రభుత్వం మరోసారి కక్షగట్టింది. ఏపీ రాజధానిలో జరగుతున్న భూ అక్రమాలపై వార్తల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. వార్తలను రాసిన సాక్షి ప్రతినిధులకు సర్కార్ నోటీసులు జారీ చేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. నోటీసుల్ని శనివారం సాక్షి కార్యాలయం బయట అంటించి వెళ్లారు.
ఇటు ప్రభుత్వ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవాలను బయటపెట్టే మీడియాపై ప్రభుత్వం కక్షసాధింపుకు దిగడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. కోర్టు ద్వారా కాకుండా పోలీసులు సమక్షంలో సాక్షి ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం. గతంలోనూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లకు ‘సాక్షి’ ప్రతినిధులను అనుమతించని విషయం తెలిసిందే.
కాగా 'సాక్షి' విలేకర్లకు నోటీసులు ఇవ్వడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఖండించింది. నోటీసులు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని, ఆ వార్త సోర్స్ల వివరాలు చెప్పాలంటూ నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదని, ఏపీ పోలీసుల అణిచివేత ధోరణిని జర్నలిస్టులంతా ఖండించాలని ఐజేయూ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్, ప్రభత్ దాస్ పేర్కొన్నారు.