జెడ్పీ చైర్ కోసం పోరు
సాక్షి, గుంటూరు :జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక శిరోభారంగా మారింది. ఆ పార్టీకి ఇంత మెజారిటీ వస్తుందని ఊహించని తెలుగుదేశం చైర్‌పర్సన్ ఎవరన్నదానిపై దృష్టిసారించలేదు. ఇప్పుడు దీనికోసం వేట మొదలైంది. వాస్తవానికి ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నాలుగేళ్ల వైఎస్సార్‌సీపీ ఈ ఎన్నికల్లో చుక్కలు చూపించిందనే చెప్పాలి. టీడీపీ కైవసం చేసుకున్న జెడ్పీటీసీ మండలాల్లో వైఎస్సార్ సీపీ మండల పరిషత్తులు సాధించింది. మొత్తానికి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో టీడీపీపై చేయి సాధించినా వైఎస్సార్ సీపీ గెలుపొందిన స్థానాల్లో అత్యధిక మెజార్టీ రావడం విశేషం. కేవలం సీట్లు సాధించడంలో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించినా, ఓట్లు పరంగా స్థానిక ఎన్నికలు జరిగిన
15 నియోజకవర్గాల్లో కేవలం 32 వేల పై చిలుకు ఓట్లు మాత్రమే ఎక్కువ సాధించడం గమనార్హం. స్వల్ప తేడాతో మండల పరిషత్తుల్ని వైఎస్సార్ సీపీ కోల్పోయింది. 22 మండల పరిషత్తులు వైఎస్సార్ సీపీ సాధించగా, టీడీపీ 35 మండల పరిషత్తుల్ని కైవసం చేసుకుంది. జడ్పీటీసీ స్థానాలు టీడీపీ 34 సాధించగా, వైఎస్సార్ సీపీ 23 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. తెనాలి డివిజన్‌లో వైఎస్సార్ సీపీ తొమ్మిది జడ్పీటీసీ స్థానాలు గెలుపొందగా, టీడీపీ కూడా తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ కొల్లిపర, చుండూరు, బాపట్ల, చేబ్రోలు, దుగ్గిరాల, కర్లపాలెం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, వేమూరు మండలాల్లో అదిక మెజార్టీతో గెలుపొందగా, టీడీపీ అమృతలూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, కాకుమాను,
కొల్లూరు, నగరం, పొన్నూరు, తెనాలి, రేపల్లె మండలాల్లో గెలుపొందింది. గురజాల డివిజన్‌లో టీడీపీ కంటే ఓ స్థానంలో వైఎస్సార్ సీపీ ఆధిక్యత కనబరిచింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ ఐదు స్థానాలు గెలుపొందగా, టీడీపీ నాలుగు స్థానాల్లోనే గెలుపొందింది. వైఎస్సార్ సీపీ దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో విజయం సాధించగా, టీడీపీ దుర్గి, కారంపూడి, మాచవరం, గురజాల మండలాల్ని కైవసం చేసుకుంది. గుంటూరు డివిజన్‌లో 14 స్థానాల్లో టీడీపీ గెలుపొందగా, వైఎస్సార్ సీపీ ఐదు స్థానాల్లో పాగా వేసింది. వైఎస్సార్ సీపీ బెల్లంకొండ, గుంటూరు, ముప్పాళ్ళ, ఫిరంగిపురం, రాజుపాలెం మండలాల్లో హవా చాటింది.
టీడీపీ అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్ళూరు, వట్టిచెరుకూరు మండలాల్లో విజయం సాధించింది. టీడీపీ జడ్పీటీసీ స్థానాలు గెలుపొందిన మండల పరిషత్తుల్లో వైఎస్సార్ సీపీ కైవసమయ్యాయి. మంగళగిరి, తాడేపల్లి, క్రోసూరు, చిలకలూరిపేట మండలాలు వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. ఇక ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు అధిక శాతం ఫ్యాన్‌కే వేసి అండగా నిలిచారు. టీడీపీ ముఖ్య నేతల ఇలాకాల్లోనూ వైఎస్సార్ సీపీ హవా చాటింది. టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ సొంత మండలం చుండూరులో వైఎస్సార్ సీపీ 3,299 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీ పాగా వేయగా, కోడెల సొంత మండలం నకరికల్లులోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఇక జడ్పీపీఠం బీసీ మహిళకు రిజర్వు కావడంతో తెనాలి డివిజన్‌కు చెందిన ఇద్దరు నేతల నడుమ పోటీ నడుస్తోందని ప్రచారం సాగుతోంది. గుంటూరు డివిజన్ నుంచి కూడా పోటీ ఎక్కువవుతోందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలి పొరుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేత ఒకరు చక్రం తిప్పుతున్నారు.