తేలని గుంటూరు పశ్చిమ | Sakshi
Sakshi News home page

తేలని గుంటూరు పశ్చిమ

Published Sat, Mar 9 2024 3:24 AM

TDP is looking for a candidate for Guntur West - Sakshi

అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట 

తెరపైకి అరడజను మంది అభ్యర్థులు 

రోజుకో అభ్యర్థి పేరుతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే

ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న మాధవి 

పొత్తులో బీజేపీకి ఇస్తారంటూ ప్రచారం 

అయోమయంలో టీడీపీ నేతలు...

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరుసగా రెండుసార్లు గెలిచిన సీటులో కూడా తమ అభ్యర్థిని నిలబెట్టలేని పరిస్థితిలో తెలుగుదేశం ఉండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు పశ్చిమలో వరుసగా  రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెచిచారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మద్దాళి గిరిధర్‌ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పెద్దసంఖ్యలో గెలిచారు. అయితే ఇప్పటికీ ఇది తమకు బలమైన సీటు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ  అభ్యర్థిని ప్రకటించలేక పోయింది. రోజుకో అభ్యర్థిని రంగంలోకి తీసుకువచ్చి ఐవీఆర్‌ఎస్‌ సర్వే జరపడంతో ఆ పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.

ఈ సీటు తమకే వస్తుందంటూ పలువురు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. మరోవైపు పొత్తులో తమకే వస్తుందని జనసేన ఇటీవల వరకూ హడావుడి చేసింది. అయితే పొత్తు 24 సీట్లకే పరిమితం కావడంతో గుంటూరు జిల్లాలో మరోసీటు వచ్చే అవకాశం లేదని తేలడంతో వారు మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా పొత్తు కుదిరితే గుంటూరు పశ్చిమ సీటు తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు.  తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర, మాజీ మంత్రి ఆలపాటి రాజా, గళ్లా మాధవి, పిడుగురాళ్ల మాధవి, తాడిశెట్టి మురళి, నిమ్మల శేషయ్య పేరుతో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించింది.

వీళ్లే కాకుండా ఈ సీటు కోసం ఎన్‌ఆర్‌ఐలు ఉయ్యూరు శ్రీనివాస్, మన్నవ మోహనకృష్ణ తదితరులు కూడా ప్రయత్నాలు చేశారు. 2019 నుంచి కోవెలమూడి రవీంద్ర ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఉయ్యూరు శ్రీనివాస్‌ 2023 నుంచి  సీటు కోసం ప్రయత్నాలు చేస్తూ వేర్వేరు కార్యక్రమాలతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మరో ఎన్‌ఆర్‌ఐ మన్నవ మోహనకృష్ణ కూడా పనిచేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా ఈ సీటుపై కన్నేశారు.  

వైఎస్సార్‌సీపీ జోరు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు నెలల ముందే చిలకలూరిపేటకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని సమ­న్వయకర్తగా ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆమె నియోజక­వర్గంలో చొచ్చుకుపోవడం, ‘మనతో మన రజనమ్మ’ అంటూ డివిజన్లలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లడం,   స్థానికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో టీడీపీ అప్పటి వరకూ తమ సామాజికవర్గ అభ్యర్థిని పరిశీలించినా, ఆ తర్వాత మనసు మార్చుకుని బీసీ మహిళను రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

గతంలో ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ను పరిశీలించినా ఆమె ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన మహిళను రంగంలోకి తీసుకు­వచ్చింది. అయితే ఇప్పటివరకూ సీటు ప్రకటించకపోవడం రోజుకొకరు రంగంలోకి వస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

Advertisement
Advertisement