Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా ఎన్టీఆర్‌ ఎలా ఎదిగాడు..? | Man Of The Masses Jr NTR Birthday Special Story, Biography, Filmography And Other Details Inside | Sakshi
Sakshi News home page

Jr NTR Birthday Special Story: 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా ఎన్టీఆర్‌ ఎలా ఎదిగాడు..?

Published Mon, May 20 2024 8:29 AM | Last Updated on Mon, May 20 2024 2:11 PM

Man of the Masses Jr NTR Birthday Special Story

ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ట్రెండింగ్‌లో ఉన్న పేరు. రౌద్రం, బీభత్సం, వీరం, కరుణ, శాంతం, హాస్యం.. ఇలా నవరసాలను సులభంగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్‌ టాప్‌లో ఉంటారు. వెండితెరపై 'నిన్ను చూడాలని' థియేటర్‌లో అభిమానులు 'రభస' చేస్తే.. ఆంధ్రుల 'సింహాద్రి'గా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద 'బాద్‍షా'గా నీ 'దమ్ము' ఏంటో చూపించావ్‌. 'జనతా గ్యారేజ్'తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టే 'యమదొంగ' అయ్యావ్‌. అందుకే నేడు నీ అభిమానులు కూడా మా 'దేవర' అంటూ.. ప్రాణంగా అభిమానిస్తున్నారు. 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా కొన్ని విషయాలు మీకోసం.

 తాతను మెప్పించిన తారక్‌.. ఎంట్రీ ఎలా జరిగింది
1983 మే 20న జన్మించిన తారక్‌ ఓ రోజు మేజర్‌ చంద్రకాంత్‌ షూటింగ్‌ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్‌ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్‌ వేయమని చెప్పారు. మేకప్‌ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్‌ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్‌ అని కితాబు ఇచ్చారు.

మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్‌ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు.

 సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు
1996లో బాల రామాయణంలో నటించిన తారక్‌ ఆ తర్వాత సినిమా ఛాన్స్‌ల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు. బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా తార‌క్ అవ‌కాశాల కోసం తిరిగాడు. ఈ క్రమంలో తారక్‌కు 'భక్త మార్కాండేయ' అనే  సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్‌ తర్వాత  'నిన్ను చూడాల‌ని' సినిమాలో హీరోగా అవ‌కాశం వ‌చ్చింది.  వి.ఆర్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్రమంలో ఎస్ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా తన తొలి చిత్రం తార‌క్‌తో 'స్టూడెంట్ నం.1' తెర‌కెక్కించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తార‌క్‌ను హీరోగా నిలబెట్టింది. 

దీని త‌ర్వాత 'సుబ్బు' డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలోనే తార‌క్‌ జీవితంలోకి వివి వినాయ‌క్ ఎంట్రీ ఇచ్చాడు. 'ఆది' క‌థ‌ను తారక్‌ వినిపించడం. అది న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ కూడా  గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 2001లో విడుద‌లైన ఈ సినిమా తార‌క్ కెరీర్‌నే మార్చేసింది. దీందో టాలీవుడ్‌ స్టార్‌ హీరలో లిస్ట్‌లో ఆయన చేరిపోయాడు. ఆ తర్వాత అల్లరి రాముడు కాస్త పర్వాలేదు అనిపించినా నాగతో మరో డిజాస్టర్‌ అందుకున్నాడు. అప్పుడు రాజమౌళితో సింహాద్రి చిత్రాన్ని అందించాడు. స్టార్‌ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అక్కడి నుంచి తారక్‌ ఎదురులేకుండా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు.

అంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్‌, రాఖీ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించకపోయిన ఆయన ఫ్యాన్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రాల తర్వాత 'యమదొంగ'తో తిరిగొచ్చాడు తారక్‌. మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత కంత్రితో ప్లాప్‌ సినిమా ఇచ్చాడు. ఆ వెంటనే అదుర్స్‌, బృందావ‌నం బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుని తన క్రేజ్‌ను మ‌రింత పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన 'శ‌క్తి' ప్రేక్ష‌కులనే కాదు తార‌క్ అభిమానుల‌ను కూడా తీవ్రంగా నిర‌శాపరిచింది.  ఆ తర్వాత తారక్‌ కెరియర్‌లో వరుస ఫ్లాపులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

ఊస‌ర‌వెల్లి, ద‌మ్ము, బాద్‌షా, రామ‌య్య‌వ‌స్తావ‌య్యా, ర‌భ‌స వంటి వ‌రుస ఫ్లాప్‌లు రావడంతో తార‌క్‌తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ‌పడ్డారు. అలాంటి సమయంలో తారక్‌కు కచ్చితంగా ఒక హిట్‌ కావాలి. సరిగ్గా అదే టైమ్‌లో  'టెంప‌ర్' క‌థ‌తో ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు డైరెక్టర్‌ పూరి  వ‌చ్చాడు. అప్పటికే ఇద్దరి కెరియర్‌లో ప్లాపులు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్‌ ఏంటి అంటూ తారక్‌పై విమర్శలు వచ్చాయి. కానీ పూరిపై నమ్మకం పెట్టుకున్నాడు తారక్‌. ఇంకేముంది, 2015లో టెంపర్‌ విడుదలైంది. అందులో ఎన్టీఆర్‌ను పూరి సరికొత్తగా చూపించాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌. మళ్లీ తారక్‌ దండయాత్ర ప్రారంభమైంది.

ఆ త‌ర్వాత‌  నాన్న‌కు ప్రేమ‌తో, జన‌తాగ్యారెజ్‌, జై ల‌వ‌కుశ‌, అరవింద స‌మేత వరుస హిట్లతో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయాడు తారక్‌. టెంపర్‌ తర్వాత తన పంతాను మార్చుకున్నాడు. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే తారక్‌ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమాల తర్వాత సుమారు మూడేళ్ల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కేటాయించాడు. ఈ కష్టం వృధా కాలేదు. తారక్‌ను పాన్‌ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లింది. ఆస్కార్‌ అవార్డ్‌ను అందుకునేంత ఎత్తుకు చేర్చింది. ఈ సినిమా అనంతరం తారక్‌ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి. కొరటాల శివతో దేవర విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో వార్‌2, ప్రశాంత్‌ నీల్‌తో మరో పాన్‌ ఇండియా సినిమా ఇలా ఆయన చేతిలో అన్నీ కూడా భారీ ప్రాజెక్ట్‌లే ఉన్నాయి.

 తారక్‌ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'
ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్‌ స్టార్స్‌ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్‌ ఫాలోయింగ్‌ అలాంటిది. ఇండియన్‌ మార్కెట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.

తారక్‌ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం
తారక్‌ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివిన ఆయన సెయింట్‌ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.
 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు.
ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకున్నారని టాక్‌. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
యమదొంగ, కంత్రి, అదుర్స్‌, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్‌ మెప్పించారు.
జపాన్‌లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్‌. బాద్‌షా సినిమా జపాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్‌ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్‌ వాటంన్నిటినీ సింగిల్‌ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్‌ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
నంబర్‌ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్‌. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.
మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.
 'ఫోర్బ్స్‌ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.
పూరీ జగన్నాథ్‌- ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.


సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్‌ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.
2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు
కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా     ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్‌
బాల రామాయణము,ఆది నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డును అందకున్నాడు 
తారక్‌కు ఫేవరెట్‌ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట
తారక్‌- ప్రణతిలకు  ఇద్దరు అబ్బాయిలు (అభయ్‌, భార్గవ్‌). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్‌ ఓ సందర్భంలో చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement