'ఆర్‌ఎక్స్ 100'తో తెలుగువారికి దగ్గరైంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం. అయితే, తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పాయల్ విచారం వ్యక్తం చేసింది. 2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు ఎన్నో సీరియల్స్‌లలో నటించిన ఆమె 'చన్నా మేరేయా' పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ చిత్రం పాయల్‌కు విజయాన్ని అందించింది. అలా 'ఆర్‌ఎక్స్ 100'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇక్కడ కూడా భారీ హిట్‌ను అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఆమెకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.
అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్‌ఎక్స్ 100'తో మెప్పించిన పాయల్.. గతేడాది విడుదలైన 'మంగళవారం' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలెంజింగ్‌గా నటించింది. ఇలాంటి పాత్రలు చేసేందుకు చాలామంది హీరోయిన్స్ అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. కానీ పాయల్ దుమ్మురేపింది. 'మంగళవారం' ఆమె కెరీర్‌లో ఒక ప్రత్యేకత గల పాత్రగా మిగులుతుంది. ఆ విజయమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది.
'2019-2020 సమయంలో నేను 'రక్షణ' అనే సినిమాను ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ '5Ws'. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. కానీ, రీసెంట్‌గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రస్తుతం నేను కూడా అందుబాటులో లేను. కానీ నా టీమ్ ఆ చిత్ర యూనిట్‌తో టచ్‌లో ఉంది. సినిమా ప్రమోషన్స్‌కు రాకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పింది. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదు. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను.' అని ఆమె తెలిపింది.
'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్
రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment