ఫుల్లు ట్రాఫిక్.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్ కార్ రెడీ అయింది. దాని పేరు హెక్సా.
అమెరికాకు చెందిన ‘లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ కార్పొరేషన్’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు.
పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ..
షోలో ఈ ఫ్లయింగ్ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్ కార్ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు.
సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.
భవిష్యత్తు ఫ్లయింగ్ కార్లదే..
కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్ యురికో కోయికే పేర్కొన్నారు.
- సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment