టీడీపీలోకి పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయనకు తెలుగుదేశం పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఊహాగానాలు వెల్లువెత్తాయి. కళ్యాణ్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. మానవతావాదిగా పేరున్న పవన్ కళ్యాణ్ను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సైతం సిద్ధంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబుకు కూడా టీడీపీ గాలం వేస్తోందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరినీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు వియ్యంకుడు హీరో బాలకృష్ణ రంగంలోకి దిగినట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రహస్య ప్రదేశంలో గంట పాటు చర్చలు జరిపినట్టు మెగా అభిమానులు, కొంతమంది టీడీపీ నేతలు వెల్లడించినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసివున్న పోస్టర్లు ఖమ్మం, విజయవాడలో దర్శనమివ్వడం తాజా పరిణామాలకు బలం చేకూరుస్తున్నాయంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటి నుంచి చిరంజీవితో పవన్ కళ్యాణ్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజారాజ్యం ఏర్పాటులో తెరవెనుక చురుకైన పాత్ర పోషించిన నాగబాబు కూడా చిరంజీవిగా దూరంగా ఉంటున్నట్టు కనబడుతున్నారు. రాం చరణ్తో నాగబాబు తీసిన ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం కూడా వీరి మధ్య దూరం పెరగడానికి కారణమయిందన్న గుసగుసలు విన్పించాయి. ఎన్నికల సమయంలో తాము దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ పార్టీతో 'అన్నయ్య' చేతులు కలపడంతో మెగాబ్రదర్స్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.
పవనిజం ఫాలోవర్స్ మాత్రం తమ హీరో రాజకీయాల్లోకి రాకూడని కోరుకుంటున్నట్టు సమాచారం. అటు టీడీపీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ను ఆహ్వానించడానికి పోటీపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలలోనూ, అభిమానులలోనూ చిరంజీవి స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆక్రమించారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతానుభవాల దృష్ట్యా రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. నాగబాబు మాత్రం రాజకీయాల్లోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ సైకిల్ ఎక్కుతారా, లేదా అనేది వేచిచూడాల్సిందే!