పగలని గోళీ | Anil Atluri spl story | Sakshi
Sakshi News home page

పగలని గోళీ

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

పగలని గోళీ - Sakshi

పగలని గోళీ

కథ
ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ. ఇనుముతో చేసిన చట్రానికి ఇనుపరేకు బిగించిన గేటు. అటూ ఇటూ చూస్తే గేటుని బిగించిన స్తంభానికి అమర్చి ఉంది ఒక బుల్లి మీట. దానిని నొక్కాడు. భయంకరమైన గొంతుతో కుక్క అరుపులు మొదలైనవి. ఒక్కసారి ఝడుసుకున్నాడు. అప్రయత్నంగానే ఒకడుగు వెనుకకు పడింది. దానిని అదిలిస్తూ లోపలెక్కడ్నుంచో ఒక ఆడమనిషి వచ్చి గేటు పైనించి అతన్ని ఎవరికోసం అన్నట్టు చూసింది.

గొంతు పెగల్చుకుని అక్కకోసం అని చెప్పేలోపు వసారా లోపల నుండి అక్క. ‘‘ఎవరూ?’’ అని చూస్తూ తమ్ముణ్ని గుర్తుపట్టి, పనిమనిషిని గేటు తెరవమని పురమాయిస్తూ ముందు వసారాలోకి వచ్చింది.
 
‘‘ఎప్పుడొచ్చావు?’’ అని అడుగుతూ, పరదాలని అడ్డం తీస్తూ లోపల హాలులోకి దారితీసింది. ‘‘నిన్ననే వచ్చాను, ఇంటర్వ్యూ కోసం,’’ అని చెబుతూ ఎడమచేతి వైపు త్రీ సీటర్ సోఫాలో ఒదిగి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అక్క. పనిమనిషి తెచ్చిన మంచినీళ్ల గ్లాసును అందుకుంటూ అటూ ఇటూ చూస్తుంటే, ‘‘బావగారు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లారు’’ అంటూ అందరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటోంది. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత. ‘‘మాటల్లో పడి మరిచిపోయాను, ఉండు నీకు టీ అంటే ఇష్టం కదా! చేసి తీసుకు వస్తాను’’ అని లేచి లోపలికి వెళ్లింది. ఆ గుమ్మానికీ పొడుగాటి పరదాలు.
 
ఎదురుగా ఉన్న పత్రికని అందుకుని తిరగెయ్యడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడి అయితే కుడిచేతి వైపుకి తలతిప్పి చూశాడు. గాలికి కదిలిన పరదాల చప్పుడు కాబోలు. దృష్టి తిప్పితే గుమ్మానికి ఎడం పక్కనే గోడకి ఉన్న ఫొటోఫ్రేమ్‌లో ఒక పదేళ్ల పాప నవ్వుతూ కనపడింది. అక్క కూతురు. ఎంత చక్కగా ఉందో. కళ్లల్లో ఒక విధమైన పెంకితనం కూడా కనపడింది అతనికి. మరోపక్క గోడమీద చామనచాయ రంగు చెక్కలతో చేసిన చట్రానికి బిగించిన అద్దం లోపలి నుంచి కనబడుతున్న బొమ్మ.

ఆ! బొమ్మ కాదు అది. ఒక్కసారి వాడి ఊపిరి స్తంభించింది. అక్క వస్తున్నదేమోనని చూశాడు. అలికిడి లేదు. లేచి సోఫాలు దాటుకుంటూ వెళ్లి ఆ చట్రం ముందు నిలబడ్డాడు. పసుపుపచ్చని రంగు అట్టమీద ఒక వైపుకి వాలుగా నెమలిపింఛం బిగించి ఉంది. గుమ్మం బయటి నుంచి హాలులోకి వస్తున్న వెలుతురు ఆ అద్దం మీద గింగిరాలు తిరుగుతున్నది. నెమలి పురివిప్పుకుని అద్భుతమైన నాట్యాన్ని మొదలుపెట్టింది. అతని కళ్లు చెమ్మగిల్లాయి. మసకబారిన ఆ కళ్లలోని తడి నెమ్మదిగా అతని మనసు లోపలి పొరలలోకి ఇంకుతోంది.
     
అతనే వాడు. వాడి మనసిప్పుడు గాలిపటంలాగా రివ్వున ఎగురుతోంది. మాంజా వేసిన దారం, పట్ట్టీలేసుకున్న వేళ్ల మధ్య నుంచి సర్రున జారుతోంది. వాడి మనసు నిండా అక్కే! కళ్ల నిండా అక్కే. వాడి ఆలోచనల నిండా అక్కే. అక్క ఈసారి ఎక్కడికి తీసుకెళుతుందో! అక్కని ఈసారి తప్పకుండా జూకి తీసుకెళ్లాలి.
 
సాయంత్రం స్నేహితులతో గోళీలు ఆడుతున్నా, వీధి మలుపు మీదే వాడి దృష్టి. కుడిచేతి చూపుడు వేలుని ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది!
 
వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. కుడిచేతి బొటనవేలు నెమ్మదిగా, మెత్తగా అప్పుడే మొలుస్తున్న గడ్డి మొలకల మధ్య నుండి చల్లగా ఉన్న ఆ నేలలోకి దిగబడుతోంది. ఇక చూపుడి వేలుకున్న గోళీకాయ విడివడడమే ఆలస్యం. నీలం రంగు గోళీకాయ పగిలిపోవాలి. వాడి ఏకాగ్రత అంతా దానిమీదే ఉంది. వాడి సావాసగాళ్ల కళ్లన్నీ కూడా వాడి చూపుడువేలుకి ఉన్న పసుపురంగు గోళీకాయ మీదే ఉన్నాయి. పగులుద్దా! వాళ్లందరూ ఊపిరి ఆపి బిగబట్టి చూస్తున్నారు.
 
వాడి ఎడమ చూపుడు వేలుతో నెమ్మదిగా కుడిచేతి చూపుడువేలు అంచుకు లాగుతున్నాడు. నేలలోకి పాతుకుపోయిన బొటనవేలు పూర్తిగా సాగిపోయింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యనున్న కండ తెగుతుందా అన్నట్టుగా సాగింది. ఇక అయిపోయింది. నీలిరంగు గోళీకాయ పగిలిపోవడం తప్పదు! అక్క నవ్వు వినపడిన తరువాత వెనక్కి లాగిన చూపుడు వేలుని వదిలాడా, లేక నీలిరంగు గోళీకాయలో అక్క నవ్వు కనపడిన తరువాత వదిలాడా అన్నది వాడికిప్పటికీ తెలియదు. ఏదైతేనేం ఆ నీలిరంగు గోళీకాయ పగిలిపోలేదు. గోడకి తగిలి మరో యాభై జానల అవతల ప్లాట్‌ఫాం అంచునుండి కిందకి జారనా వద్దా అన్నట్టు వూగి, రోడ్డుమీదకి జారిపడిపోయింది.
 
అప్పుడు వినపడింది ఫియట్ కార్ హార్న్ వాడికి. కారు మలుపు తిరుగుతోంది. వెనక సీట్లో అక్క కనపడుతోంది. బావగారికి డ్రైవర్ అడ్డంగా ఉన్నాడు. ఆయన సరిగ్గా కనపడ్డం లేదు. అటుపక్కనే ఉన్న చెవిపోగులు గాడిని, ఇటువైపున్న గద్దముక్కుని తోసేసి ఉరుకు. లాగు నడుంపైకి లాక్కుంటూ ఉరుకు. ఇంటిగేటు వైపుకు కారుకి ఎదురుగా ఉరుకు. కారు ఇంకా ఆగలేదు. వెనక తలుపు తెరుస్తూ తనవైపుకి లాక్కున్నాడు. అక్క ముఖం నిండా నవ్వు. వాడి మొఖం నిండా నవ్వు. అక్క మీదకి దూకి. రెండు చేతులు అక్క మెడ చుట్టూ వేసేశాడు. అక్క వాడిని వాటేసుకుని, హత్తుకుంది. వాడికి ఆ క్షణంలో ప్రపంచం గుర్తులేదు. వాడికి అక్కే ప్రపంచం అయిపోయింది.
 
అక్క కదిలింది. వాడు కదిలాడు. అక్క కుడిపాదం జాపి నెమ్మదిగా కారులోంచి దిగింది. ఈలోపు అలికిడికి అమ్మ బయట వసారాలోకి వచ్చింది. అక్కని కుడిచెయ్యి పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ తీసుకువెళుతున్నాడు వాడు. అక్కను చూస్తున్న ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. వెనక వస్తున్న బావగారిని చూసి పలకరింపుగా నవ్వింది. వసారాలో గుమ్మం పక్కనే చెప్పులు విడిచింది అక్క. ఆమె కుడిచేతిని వాడు ఇంకా వదల్లేదు. అమ్మ లోపల హాలులోకి వెళ్లింది. బావగారు కూడా వసారాలోకి వచ్చి, అక్క విడిచిన చెప్పుల పక్కనే తన చెప్పులు విడిచారు.

హాలు లోపలికి అక్క వెనకే అడుగులు వేశారు. హాలులో ఎడమచేతి వైపు విడిగా ఉన్న సోఫాలో బావగారు కూర్చున్నారు. ఆయన పక్కనే ఉన్న చిన్న మోడా మీద కూర్చుంది. అక్క ఒడిలోకి జారిపోయాడు వాడు. డ్రైవరు హాలులోపల గుమ్మానికి కుడిపక్కన గోడపక్కనే సూటుకేసులని నిలబెట్టాడు. ఈలోపు పనిమనిషి స్టీలు ట్రేలో రెండు గాజు గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది. బావగారు ఒక గ్లాసు అందుకున్నారు. వాడు ఆ రెండో గ్లాసుని అందుకుని అక్కకి ఇచ్చాడు. హాలులో గుమ్మం పక్కనే పొట్టి టేకు బల్లమీద నల్ల ఫోను అందుకుని అమ్మ ఫోను చేసింది నాన్నగారికి... ‘‘అమ్మాయి, అల్లుడుగారు వచ్చేశారు, తొందరగా వచ్చేయండి’’ అంటూ.
 
సూటుకేసులు అవీ పాప గదిలో పెట్టమని పనిపిల్లని పురమాయిస్తూ వచ్చిన జంటని స్నానం చేసి బట్టలు మార్చుకోండి అని చెబుతూ నాన్నగారికి వారి రాకని తెలియజేశానని తొందరగా వచ్చేస్తారని అక్కకి చెప్పింది అమ్మ. వాడు అక్కతో పాటు పడకగదిలోకి వెళ్లాడు. ఒక పక్కగా చిన్న బల్లమీద పెట్టి ఉన్నవి సూట్‌కేసులు. ఆ బల్ల పక్కనే రెండు టేకుతో చేసిన కుర్చీలు. సూట్‌కేసుని తెరిచింది అక్క. బట్టలపైనే ఉందది. కపిల వర్ణం కాగితంతో ఉన్న చిన్న కట్ట. తెల్లని టై్వన్ దారంతో భద్రంగా కట్టారు. పక్కనే తనని ఆనుకుని నిలబడ్డ తమ్ముడికి ఇచ్చింది అక్క. రెండు చేతులతో దానిని అందుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీమీద కూర్చుని దాని ముడి విప్పాడు.

లోపల రంగు రంగుల బొమ్మలతో అందంగా ఉన్న పుస్తకాలు. జానపద కథలు, కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి. పిల్లల గేయాలు. వాడి కళ్లల్లో ఆనందం చూసి అక్క మురుసుకుంది. కొద్దిగా వంగి, వాడి చెంపలని తన రెండు అరచేతుల మధ్య పట్టుకుని వాడి తలని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా, చప్పుడు చేస్తూ వాడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. అటుపక్కన తన సూట్‌కేసులో బట్టలు తీసుకుంటున్న బావగారు వాళ్లిద్దర్ని చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. క్రీగంటన అది చూసి వాడు సిగ్గుపడ్డాడు. గారంగా భుజాలూపుతూ వాడు అక్క ఒడిలోకి మరింతగా ఒదిగిపోయాడు. వీపు మీదకి చేతులు జార్చి చప్పుడయ్యేట్టు చరిచి వాడిని పక్కకి నెట్టేసింది అక్క.
 
అక్క, బావగారు ఒక వారం రోజులున్నారు. ఒకరోజు హాలులో భోజనాలు. ఒక సాయంత్రం బతికిన కాలేజీ. మరో రోజు హోటల్లో. ఒకపూట అక్క చదువుకున్న స్కూలు. మరోరోజు ఉదయం వరండాలో పిట్టగోడమీద కూర్చుని టిఫిన్లు. ఇంకో రోజు డాబామీద వెన్నెల రాత్రిలో భోజనాలు. అక్కతో కనీసం ఒక ముద్దన్నా పెట్టించుకోనిదే భోజనాల తరువాత చెయ్యి కడిగేవాడు కాదు. మరొకపూట ఉద్యానవనం. ఉయ్యాలలో అక్కతో పోటీ. బావగారితో సినిమాలు, షికార్లు. ఆ వారం రోజులు పండుగే వాడికి.
     
ఆగమని అంటూ తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తాడు. తన మేజా మీదనున్న లెక్కల నోటు పుస్తకం తెరిచి పేజీలు తిరగేశాడు. మెరుస్తూ కనపడిందది. వాడి బెస్టుఫ్రెండ్ వాడి కోసం ఇచ్చిందది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని మళ్లీ రివ్వున పరిగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చాడు. అక్కని చెయ్యి చాపమని అడిగాడు. కారు తలుపులో నుంచి కుడిచేతిని చాపింది.
 అరచెయ్యి తెరిచి ఉంది.

నెమ్మదిగా అక్క అరచేతిలోకి జార్చాడు దానిని. మృదువుగా, మెత్తగా వాడి ప్రేమంత మధురంగా ఉంది ఆ నెమలి పింఛం. అందుకుంది అక్క. కళ్లు చెమర్చాయి. అమ్మ పక్కకి తిరిగి చీరకొంగుతో కళ్లు వత్తుకుంది. గేటు దగ్గర నిలబడ్డ నాన్న కళ్లజోడు అద్దాలు కొంచెం మందమైనవి. ఆయన కళ్లు ఆ జోడులో నుంచి కనపడలేదు. బావగారు చేతులూపారు. కారు కదిలింది. అక్క ఆయన భుజం మీదకి వాలిపోవడం కనపడింది. ఆయన ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశారు. బహుశా ఓదార్చుతున్నారేమో!
     
‘‘ఏమిటి ఇక్కడ నిలబడ్డావు?’’ అని అడుగుతూ అక్క ఆ నెమలిపింఛాన్ని చూసి చిరునవ్వుతో, ‘‘నువ్వు ఇచ్చిందే. బావగారు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు’’ అంటూ సోఫా వైపుకు దారితీసింది. వాడికోసం టీతో పాటు కొన్ని చేగోడీలు, చక్కిడాలు, పంచదార గవ్వలు ఉన్న పింగాణి పళ్లెం తెచ్చి సోఫా ముందున్న గాజు టేబుల్ మీద పెట్టింది. అక్కకి మాత్రమే కాదు తనంటే ప్రేమ. బావగారికి కూడా తనంటే ఎంతో ఇష్టం అని మురుసుకున్నాడు. ఎప్పుడెప్పుడా రాలిపోదాం అని చూస్తున్న కన్నీళ్లని అక్క చూడకుండా ఒడుపుగా అరచేతుల్తో గబుక్కున తుడిచేసుకున్నాడు.
     
లోపలెక్కడో ఉన్న కుక్క మళ్లీ నెమ్మదిగా గారంగా మొరుగుతోంది. సోఫాలోకి కూలబడి, తలవంచుకునే తన చదువు గురించి, ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన సంస్థ గురించి, ఉద్యోగం ప్రాముఖ్యత గురించి చెబుతూ అక్క గుర్తుచేసినప్పుడల్లా ఒక గవ్వో, చేగోడో, చక్కిడమో అందుకుని తింటూ, ఇక చాలన్నట్టుగా మంచినీళ్లు అందుకుని తాగాడు. టీ కప్పున్న సాసర్‌ని అందుకున్నాడు కుడిచేతితో. ఎడమచేతితో సాసర్‌ని పట్టుకుని కుడిచేతితో కప్పు చెవిని చూపుడువేలు, బొటన వేళ్ల మధ్య పట్టుకుని పెదవుల దగ్గరికి తీసుకువెళ్లాడు నెమ్మదిగా. పెదవులకి ఆనించి, ఒక గుక్క జాగ్రత్తగా నోట్లోకి లాగాడు చప్పుడుచేయకుండా. కాలలేదు. తనకి సరిపోయే వేడితోనే ఉందా టీ. పంచదార కూడా సరిపోయింది. అక్క టీ చెయ్యడంలో మార్పేమీ లేదు. అప్పుడు తలెత్తి అక్కని చూశాడు. దేవత.
 
ఫోను మోగింది. బావగారేమో? అక్క లేచి వెళ్లి ఫోనులో ఏదో మాట్లాడుతోంది. టీని మరో గుటక వేశాడు. అక్క కలిపిన టీ. ఎంత బాగుందో. నెమ్మదిగా గొంతులో నుంచి జారుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో! అక్క తనకోసం చేసింది. అక్కకి తనమీద ప్రేమ తగ్గలేదు. పనిమనిషిని చెయ్యనివ్వలేదు. తనే చేసి తనే తీసుకువచ్చి ఇచ్చింది. అక్కకి తనమీద ప్రేమ ఏమీ తగ్గలేదు. లోపలి నుంచి ఇందాక ఫొటోలో చూసిన పాప సుడిగాలిలా గదిలోకి వచ్చింది. తెల్ల రంగు ఫ్రాక్. ఎర్రని అంచులతో. బొద్దుగా, ఆరోగ్యంగా చక్కగా ఉంది. హాలులో ఎవరో కొత్తమనిషి ఉన్నారన్నది గుర్తించింది. ఒక్క క్షణం. అలా అక్కడే ఆగిపోయింది. ‘‘ఎవరో గుర్తుపట్టావా?’’ అని అక్క పాపని అడిగితే, లేదంటూ అడ్డంగా, కొంచెం విసురుగానే తలని తిప్పినట్టుంది. అక్క నవ్వుతూ, ‘గుర్తుతెచ్చుకో’ అంటోంది.
 
ముందుకు వంగి గాజు టేబుల్‌మీద టీకప్పుని అందుకుని, అక్క ఎంతో ప్రేమగా తనకోసం చేసిన టీ మరో గుటక వేసుకోవడానికి నోట్లోకి వంపుకున్నాడు. అది గొంతులోకి జారి అక్కడి నుంచి నెమ్మదిగా, అతి నెమ్మదిగా అతని గుండెల్లోకి ఆమె ప్రేమని వొంచి నింపుకుంటున్నాడు. పాప అప్పుడు గమనించినట్టుంది అతను టీ తాగడం. అక్కవైపు చూస్తూ, ‘‘టామీకి పాలు లేవు మమ్మీ. చూశావా?’’ అని అడుగుతూ, కొత్తగా కనబడుతున్న అతనివైపు చూసింది.

పాప దృష్టి ఇప్పుడు అతని చేతిలోని టీ కప్పు మీద పడింది. ఆ మరుక్షణం ఆ కళ్లలో ఒక వెలుగు. ఒక మెరుపు. తనకి అర్థమై తెలిసిపోయిందన్న అమాయకపు గర్వంతో కూడిన వెలుగు. ఒక్క క్షణమే ఆ మెరుపు. అప్పుడు ఆ కళ్లలోని అర్థమైన మెరుపుని ఆ ‘పక్కంటి’ తమ్ముడు ఎప్పటికీ మరిచిపోడు. ‘‘మమ్మీ, టామీ పాలతో టీ కలిపిచ్చావా? చీ యాఖ్... ఆ పాలు కుక్కకోసం ఉంచినవి’’ అంటూ ప్రపంచంలోని అసహ్యాన్నంతా ఆ పదాలలోకి ఒంపి, నింపి బయటకు విసిరేసింది.
- అనిల్ అట్లూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement