
బాబు అనైతిక రాజకీయాలను మోదీ ఆమోదిస్తారా
(వెబ్ ప్రత్యేకం)
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల విషయంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అనైతిక చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదిస్తారా?. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోయినప్పటికీ నాలుగవ అభ్యర్థిని రంగంలో నిలిపి అనైతిక చర్యలకు పాల్పడటానికి రంగం సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలపై బీజేపీలో నేతల్లో అంతర్మథనం మొదలైంది. వచ్చే జూన్ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 11 న నిర్వహించే ఈ ఎన్నికలకు సంబంధించి మంగళవారం (మే 31తో) నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ముగుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయా పార్టీల బలాబలాల మేరకు అధికార టీడీపీ మూడు స్థానాలను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకోగలవు. టీడీపీ గెలుచుకునే మూడు స్థానాల్లో రెండింటికి పోటీ చేసి మిగిలిన ఒక స్థానం బీజేపీ అభ్యర్థికి మద్దతునివ్వాలని నిర్ణయించింది. ఆ ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభును పోటీ చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
టీడీపీ గెలుచుకునే మూడు స్థానాలకు గాను రెండింట ఆ పార్టీ అభ్యర్థులు, మరోస్థానంలో బీజేపీ పోటీకి నిలిపిన తర్వాత మరో అభ్యర్థిని నిలిపి గెలుచుకునే సంఖ్యలో టీడీపీకి ఎమ్మెల్యేల బలం లేదు. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసి మరో అభ్యర్థిని రంగంలోకి దింపాలని గత కొద్ది రోజులుగా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. భయబ్రాంతులకు గురిచేస్తూ విచ్చలవిడిగా డబ్బు గుమ్మరించడం వంటి అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఇలా చేరిన 17 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా మరో అభ్యర్థిని గెలిపించుకోలేరు.
అలా చేర్పించుకున్న ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నాలుగవ అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ నేతలతో రహస్య మంతనాలు మొదలుపెట్టారు. కోట్లాది రూపాయలు డబ్బులు వెదజల్లే ఒక పారిశ్రామిక వేత్తను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మద్దతుతో బరిలోకి దింపినప్పటికీ ఆ వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారని ప్రచారం చేయాలని, ఈలోగా మరికొందరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ దారిలోకి తెచ్చుకోవడానికి మరో వంద కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేయగలిగే ఒక పారిశ్రామిక వేత్త పేరును కూడా పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో చంద్రబాబు తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తారని కూడా చెబుతున్నారు.
కనీస బలం లేకుండా తన అధికారాన్ని ఉపయోగించి బేరసారాలు చేసి అవతలి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనైతిక, అప్రజాస్వామిక చర్యల ద్వారా చంద్రబాబు మరో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయించే విధానాన్ని వ్యతిరేకించని పక్షంలో మిత్రపక్షంగా ఆ చర్యలను సమర్థించినట్టవుతుందని బీజేపీ సీనియర్లు చెబుతున్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయ చర్యలకు బీజేపీ మద్దతు ఉన్నట్టు స్పష్టమవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతోనే అది జరిగిందన్న అపవాదు కూడా మూటకట్టుకోవలసిన పరిస్థితి ఉంటుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నాటక రాష్ట్రంలోని దావణగేరే వికాశ పర్వ్ సభలో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడమే కాకుండా నైతిక విలువలపై ప్రసంగం చేశారు. అవినీతి అక్రమాలకు దూరంగా పాలన సాగిస్తామని ప్రతిన చేసిన నరేంద్ర మోదీ ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అత్యంత హేయమైన పద్ధతిలో అనైతిక చర్యలకు పాల్పడటాన్ని సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా మరో 24 గంటల్లో తేలిపోనుంది. రాజ్యసభ పోటీకి నామినేషన్లు దాఖలు చేయడానికి మంగళవారంతో గడువు ముగుస్తుంది.
కె.సుధాకర్ రెడ్డి