న్యూయార్క్: ఆగ్రహంతో అమెరికా ప్రజలు చేస్తున్న అరుపులకు ఆ దేశ దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ధర్నా చౌరస్తాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, ముఖ్యంగా రెండో రోజు కూడా విమానాశ్రయాల ప్రాంగణాలు నిరసన నినాదాలతో మారుమ్రోగిపోతున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం ఎక్కి పట్టుమని పది రోజులు కూడా కాకమునుపే ప్రజలకు నిద్రలేకుండా చేయడంతో వారు మండిపడుతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో హడలెత్తిస్తుండటంతో అంతా తమ నివాసాలు విడిచి రహదారుల బాటపట్టారు.
మొత్తానికి అమెరికానే ముందు.. ఆ తర్వాతే ఎవరైనా అని పేర్కొంటూ ఏకంగా అణుబాంబంత ప్రజావ్యతిరేకతను ట్రంప్ మూటకట్టుకుంటున్నారు. వీసా నిబంధనలు పునరుద్ధరించే మరో 90 రోజులుపాటు ఏడు దేశాల ముస్లింలకు అమెరికాలోకి ప్రవేశం లేదంటూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోగా 'ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. వలసదారులు, శరణార్థులు అమెరికాకు నిర్భయంగా రావొచ్చు' అంటూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆహ్వానిస్తున్నారు.
అమెరికాలో ఆదివారం విమానాశ్రయాల లోపల మొత్తం ఖాళీ ఏర్పడగా.. బయటమాత్రం వేలమందితో కిక్కిరిసిపోతున్నాయి. అది కూడా ట్రంప్ వ్యతిరేక ఆందోళనలతో. దాదాపు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలన్నీ కూడా ఆందోళనలకు నిలయాలుగా మారాయి. లాస్ ఎంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, డల్లాస్, న్యూయార్క్ జేఎఫ్ కెన్నడీ, రాలేగ్, హ్యూస్టన్, సీటెల్, పోర్ట్లాండ్, అట్లాంటాతోపాటు పలు విమానాశ్రయాల్లోని టర్మినల్స్ వద్దకు వేలల్లో చేరిన పౌరులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజు ఎలాగైతే ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీలు తీశారో అచ్చం అలాగే తాజాగా చేస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ కూడళ్లు, వైట్ హౌస్ వద్ద, బోస్టన్ కోప్లీ స్క్వేర్, మన్ హట్టన్‌లోని బ్యాటరీ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్కో పార్క్ వద్ద దాదాపు పదివేలమంది పోగై నిరసనలు తెలియజేస్తున్నారు. 'ద్వేషం లేదు.. భయం లేదు.. వలసదారులు మేం స్వాగతం పలుకుతున్నాం' అంటూ గీతాలుగా ఆలపించారు. ఇప్పటికే వచ్చి విమానాశ్రయాల్లోనే ఇరుక్కుపోయిన వారిపట్ల సానుభూతి ప్రకటిస్తూ సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం నిర్భందించిన ఇద్దరు ఇరాకీయులను విడిచిపెట్టారు.
ప్రస్తుతానికి అన్ని విమానాశ్రయాల వద్ద ఆందోళన జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగడం లేదు.శాంతియుత వాతావరణంలోనే ఆందోళనలు చేస్తున్నారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి
(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్)
(ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు)
(ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!)
(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)
ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?
ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!
ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!
వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా
'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'