పాక్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా
న్యూఢిల్లీః పాకిస్తాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. పాక్ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ఆందోళనలను అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఉగ్రవాదులకు ఊతమివ్వడాన్ని పాక్ విరమించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్తాన్‌ను చైనా పదేపదే సమర్థిస్తూ వస్తోంది. చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జిచి అమెరికా విదేశాంగ కార్యదర్శి టిల్లర్‌సన్‌తో ఫోన్ సంప్రదింపులు జరిపారు.
ఆప్ఘనిస్తాన్ పరిణామాల్లో పాక్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నదని ఈ సందర్భంగా యాంగ్ వివరించినట్టు చైనా వార్తా సంస్థ వెల్లడించింది. ఆఘ్ఘన్ వ్యవహారాల్లో పాక్ చూపిన చొరవను పరిగణనలోకి తీసుకోవాలని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని,భద్రతా ఆందోళనలను మనం గౌరవించాలని సూచించినట్టు పేర్కొంది. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సందర్భంలోనూ చైనా పాక్‌కు బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్తాన్ రాజీలేని పోరు కొనసాగిస్తున్నదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హు చునింగ్ పేర్కొన్నారు.