వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు
జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని గాల్లోకి విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
కానీ గాల్లో నుంచి కిందికి వచ్చే సమయంలో వరుడు పట్టుకోవడంలో విఫలం అవ్వడంతో ఆ అమ్మాయి కింద పడింది. తల కిందులుగా పడటంతో మెదడుకు బలమైన గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న ఆ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.