వుహాన్: ఇప్పటికే రెండు వేల మందికి పైగా పొట్టనబెట్టుకున్న ప్రాణాంతక కోవిడ్-19.. వైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లియూ చిమింగ్‌ను కూడా బలితీసుకుంది. వుహాన్‌లోని వుచాంగ్ ఆస్పత్రిలో లియూ ప్రధాన డాక్టర్. అహర్నిశలు కరోనా రోగులకు వైద్యసేవలందించిన లియూ ఆ క్రమంలోనే వైరస్ బారిన పడ్డారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన గత మంగళవారం ప్రాణాలు విడిచారు. 51 ఏళ్ల లియూ అకాలమరణంతో ఆయన భార్య కాయ్ ఒంటరైంది. భర్తను కడసారి చూసుకునే వీలులేకపోవడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. లియూ భౌతిక కాయాన్ని దహనానికి తీసుకెళ్తుండగా.. నిండా మాస్కులతో ఉన్న కాయ్ వాహనం వెంట పరుగెడుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. లియూ బంధువులు, సహోద్యోగులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. చైనాలోని లక్షలాది మంది ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
(చదవండి : కోవిడ్‌కు వైద్యుడు బలి)
దగ్గరకు రానివ్వలేదు..
జనవరి 23న లియూ వైరస్ బారిన పడగా.. అప్పటి నుంచి కాయ్‌కు ఆయన్ను చూసే అవకాశం దక్కలేదు. క్వారంటైన్‌లో ఉన్న భర్తను కలుద్దామని ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయన ఒప్పుకోలేదు. తన వల్ల భార్యకు వైరస్ సోకుందేమోనని ఆయన భయపడ్డారు. ఇక లియూ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను ఫిబ్రవరి 4న ఐసీయూకి తరలించారు. ఫోన్‌లో మెసేజ్‌లు, వీడియో కాలింగ్‌తోనే ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే వీలు కలిగింది.
(చదవండి : కరోనా వైరస్ ‘హీరో’ కన్నుమూత)
మళ్లీ విధులకు హాజరవుతా..
వుహాన్‌లోని నెం.3 ఆస్పత్రిలో ప్రధాన నర్సుగా పనిచేస్తున్న కాయ్ భర్తతో గడిపిన చివరి క్షణాలు గుర్తు చేసుకుని భోరుమన్నారు. ‘వుచాంగ్ ఆస్పత్రి కరోనా రోగులతో ఎప్పుడూ కిక్కిరి ఉండటంతో నా భర్త సరైన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోలేదు. వైరస్ బారిన పడినప్పటినుంచే తీవ్రమైన జ్వరంతో ఆయన విలవిల్లాడిపోయారు’అని కాయ్ చెప్పుకొచ్చారు. తన భర్త మరణంతో ఆగిపోనని, మళ్లీ విధులకు హాజరువుతానని ఆమె తెలిపారు. వైద్యచికిత్స కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని, నర్సుగా సేవలు కొనసాగిస్తానని వెల్లడించారు.
(చదవండి : తగ్గుతున్న కోవిడ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment