జయ నుంచి జైలు దాకా శశి పయనం
అయితే, అలా తప్పుకున్న ఆయన నేరుగా తనకు అండగా నిలుస్తారని శశికళ భావించి ఉండొచ్చు.. లేదంటే ఎమ్మెల్యేల సహాయంతో సెల్వాన్ని ఎదుర్కోవచ్చని ఎత్తుగడలు కూడా వేసి ఉండొచ్చు. కానీ, తాను వెళుతుంటే ఆ బాటంతే పూలబాటే అవుతుందని ఎవరో అదృష్టవంతుడు అనుకున్నట్లు పన్నీర్ సెల్వానికి అనూహ్యంగా కలిసొచ్చిన అంశం మాత్రం శశికళపై అక్రమాస్తుల కేసు. ఈ కేసు తొలుత బయటకు రానప్పటికీ ఆయన శశికళకు ఎదురు తిరిగిన తర్వాత బాగా వినిపించడం కాస్తంత గమనించాల్సి ఉంటుంది. అమ్మ సెంటిమెంటు ఆయుధంగా చేసుకున్న సౌమ్యుడు సెల్వం ఆమె సమాధి వద్దకు వెళ్లి శశికళపై బాంబులమీద బాంబులు పేల్చారు.
తనను బలవంతంగా దించారని, అమ్మ మరణంపై అనుమానం ఉందని, ఆమె నేరస్తురాలని ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రజలు కోరితే పదవి చేపడతా అంటూ దాడి మొదలుపెట్టారు. దీంతో శశికళ దృష్టి అంతా కూడా పన్నీర్‌ను ఎదుర్కోవడంపైనే పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటికీగానీ అసలు యుద్ధం మొదలుకాలేదు.. ఈలోగా అనూహ్యంగా గత ఏడాది ఎప్పుడో జూలై నెలలో అక్రమాస్తుల కేసుపై తదుపరి విచారణ తేదిని ప్రకటించకుండానే పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఒక్కసారిగా వార్నింగ్ బెల్ కొట్టింది. అయితే, రాష్ట్ర రాజకీయంపైనే దృష్టి పెట్టిన శశికళ ఈ కేసే తన కొంపముంచనుందని అంచనా వేయలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందన్న ఆశాభావంతోనే శశికళ ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఇటు సెల్వం వ్యూహాల విషయంపక్కన పెడితే అక్రమాస్తుల కేసు వచ్చిపడి అమాంతం శశికళ ఆశలను ఒక్కసారిగా ఆవిరి చేసింది. దీంతో ఇప్పుడు ఆమె నాలుగేళ్లపాటు గతంలో ఆరు నెలలు పూర్తి చేసిన ఆమె మరో మూడున్నరేళ్లు జైలులో ఉండాల్సి ఉంటుంది. అనంతరం మరో ఆరేళ్లపాటు ఏ రాజకీయ పదవికి అర్హురాలు కారు.. పోటీ కూడా చేయరాదు. ఇలా జయవెంటే మొదలైన ఆమె ప్రస్థానం నేటి జైలు వరకు ఎలా కదులుతూ వచ్చిందో సంక్షిప్తంగా గమనిస్తే..
- తమిళనాడులోని మన్నారుగుడికి చెందిన శశికళకు జయలలితకు 1976లో స్నేహం కుదిరింది. అప్పుడు జయ సినిమాల్లో విజయవంతంగా ఉండంటంతోపాటు రాజకీయాల్లో ఎదగడం మొదలుపెట్టారు.
- సొంతంగా వీడియో పార్లర్ కలిగిన శశికళ జయలలిత రాజకీయ కార్యక్రమాలు, జయలలిత స్పీచ్‌లు రికార్డింగ్‌లు చేసేవారు. ఆ తర్వాత జయతో కలిసి ఆమె ఎక్కడికి వెళ్లినా తోడుగా వెళ్లడం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం చేసేవారు.
- 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయిన సమయంలో జయకు రాజకీయంగా బలంగా మద్దతిచ్చిన వారిలో శశికళ కూడా ఒకరు.
- తర్వాత జయతోపాటు ఆమె పోయెస్ గార్డెన్‌ను, నివాస సంరక్షణ బాధ్యతలు చూసేందుకు శశికళ వెళ్లగా ఆమె మేనళ్లుడు సుధాకరణ్ కూడా వెళ్లాడు. అతడే తర్వాత పెంపుడు కొడుకుగా మారాడు
- 1996లో సుధాకరన్ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడంతో అసలు వివాదం మొదలైంది. పెద్ద మొత్తంలో అక్రమ సంపాధనతో జయ ఈ వివాహం చేశారని ఆమెపై అసెంబ్లీలో రచ్చరచ్చ అయింది. ఈపరిణామాల తర్వాత శశికళ అరెస్టయింది. దీంతో వారిని కొద్ది రోజులపాటు జయ దూరగా పెట్టారు.
- 2011లో శశికళను పూర్తిగా పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత బయటకు గెంటేశారు. మన్నారుగుడి వర్గంతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా కుట్రలకు దిగారనే అనుమానంతో శశిని, జయ బంధువులను, విశ్వసనీయులను దూరంగా పెట్టారు.
- మళ్లీ కొద్ది రోజుల తర్వాత శశికళ పోయెస్ గార్డెన్‌కు తన భర్తను, బంధువులను వదిలేసి జయలలిత వద్దకు చేరారు.
- గత ఏడాది 2016 డిసెంబర్ 5న జయలలిత చనిపోవడంతో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యారు.
- చివరకు నేడు (ఫిబ్రవరి 14)న సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.