జయలలిత చనిపోయినపుడే తెలిసింది | we will form government, says sasikala | Sakshi
Sakshi News home page

జయలలిత చనిపోయినపుడే తెలిసింది

Published Mon, Feb 13 2017 3:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

జయలలిత చనిపోయినపుడే తెలిసింది

జయలలిత చనిపోయినపుడే తెలిసింది

చెన్నై: అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడ్డాక సహనంతో వ్యవహరిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ విమర్శలను తీవ్రం చేశారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష డీఎంకేలను ఇప్పటి వరకు విమర్శిస్తూ వస్తున్న చిన్నమ్మ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశారు. పార్టీలో సంక్షోభానికి బీజేపీ, డీఎంకేలే కారణమని నిందించారు. పన్నీరు సెల్వం ఎప్పుడూ పార్టీకి విధేయుడిగా లేరని విమర్శించారు. సోమవారం పోయెస్ గార్డెన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జయలలిత చనిపోయినపుడే పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని తెలిసిందని చెప్పారు.

జయలలిత వెంట 33 ఏళ్లు ఉన్నానని, ఈ 33 ఏళ్లలో వెయ్యిమంది పన్నీరు సెల్వాలను చూశానని శశికళ అన్నారు. తాను ఎవరికీ భయపడేదిలేదని చెప్పారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా పార్టీ భవిష్యత్‌ కోసం భరిస్తున్నానని, నిజానిజాలు ఏంటో కచ్చితంగా అందరికీ తెలుసునని అన్నారు. తనకు అధికార కాంక్ష లేదని, పన్నీరు సెల్వంను తమిళనాడు ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అన్నా డీఎంకే ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నానని, కానీ సెల్వం డీఎంకేకు మిత్రుడిలా వ్యవహరించడం బాధించిందన్నారు. త్వరలోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో అమ్మ ఫొటోలను ఏర్పాటు చేస్తామని శశికళ చెప్పారు. అనంతరం గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement