వీసాపై ట్రంపరితనం! | Trump Order for H-1B Visa Reforms | Sakshi
Sakshi News home page

వీసాపై ట్రంపరితనం!

Published Fri, Apr 21 2017 10:25 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

వీసాపై ట్రంపరితనం! - Sakshi

వీసాపై ట్రంపరితనం!

హెచ్-1బి వీసా సంస్కరణల కోసం ట్రంప్ ఉత్తర్వు
వీసాలు దుర్వినియోగమవుతున్నాయని విమర్శలు
సిఫారసుల నివేదికలు వస్తేనే మార్పులేమిటో తెలిసేది
ఆపైన కాంగ్రెస్ ఆమోదిస్తేనే వీసా సంస్కరణలు అమలు
ఇప్పటికే అమెరికాలో నిపుణులైన ఉద్యోగులకు కొరత
వీసాలు ఇంకా కఠినతరం చేస్తే అమెరికా ఐటీకీ కష్టమే
ఐటీ సంస్థలే వలస వెళ్లే పరిస్థితి రావచ్చని హెచ్చరికలు


అమెరికా.. లక్షలాది మంది భారతీయులకు కలల దేశం. ఏటా వేలాది మంది ఉద్యోగం కోసం ఆ దేశం వెళుతుంటారు. కానీ.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచీ మనవాళ్లలో కలవరం పెరుగుతోంది. అమెరికా వెళ్లాలన్న ఆకాంక్షలకు.. వలసలపై ఆంక్షలు, వీసాలపై సమీక్షల పేరుతో ట్రంప్ బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా హెచ్-1బి వీసా మీద కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వు ఏమిటి? భారతదేశం మీద, అమెరికా మీద దాని ప్రభావం, పరిణామాలు ఎలా ఉండొచ్చు?

నిపుణులు ఏమంటున్నారు?
హెచ్‌-1బి మీద ట్రంప్‌ తాజా ఉత్తర్వు ఏమిటి?: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా ‘అమెరికావే కొనుగోలు.. అమెరికన్లకే ఉద్యోగాలు’ అనే పేరుతో కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. ఇందులో ‘అమెరికన్లకే ఉద్యోగాలు’ అంశం కింద హెచ్‌-1బి వీసా విధానం సంస్కరణల దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ వీసా విషయంలో ట్రంప్ ఉత్తర్వు సారాంశం ఏమిటంటే.. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వంలోని నాలుగు శాఖలను – విదేశాంగ శాఖ, అంతర్గత భద్రత శాఖ, కార్మిక శాఖ, న్యాయశాఖలను – ప్రస్తుత హెచ్-1బి వీసా విధానాన్ని నవంబర్‌ నాటికి సమీక్షించి, అందులో చేయాల్సిన మార్పులను సిఫారసు చేయడం. ఆయా సంస్థలు సమీక్షించి, సిఫారసులు ఇచ్చే వరకూ.. హెచ్-1బి వీసా విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది అస్పష్టమే.

అసలు హెచ్-1బి వీసా అంటే ఏమిటి?
అమెరికాలోని సంస్థలు తమ దేశంలో అంతర్గతంగా లభించని ఉద్యోగులను.. అందులోనూ ఉన్నత నైపుణ్య ఉద్యోగాలను భర్తీ చేయడానికి విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అవకాశం కల్పించే వీసాయే హెచ్-1బి వీసా. ఈ వీసాల కోసం ఏటా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో ప్రస్తుతం సంవత్సరానికి 85,000 మందికి ఈ వీసాలు జారీ చేస్తున్నారు. వీటిలో 20 వేల ఉద్యోగాలను పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఆపైన విద్యార్హతలు గల వారికి మాత్రమే ఇస్తారు. ఈ వీసా వస్తే మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకూ అమెరికాలో నివసించి, ఉద్యోగం చేసుకునే హక్కు లభిస్తుంది.

భారతీయులకు హెచ్-1బికి లింకేమిటి?
ఈ హెచ్-1బి వీసాల్లో దాదాపు మూడొంతుల వీసాలు భారతదేశానికి చెందిన ఐటీ ఇంజనీర్లు, డెవలపర్లు వినియోగించుకుంటున్నారు. భారతీయ దరఖాస్తుదారులకు గత ఏడాది దాదాపు 1,27,000 వీసాలు జారీ చేసినట్లు అమెరికా ప్రభుత్వ లెక్కలు చూపుతున్నాయి. ఇందులో అత్యధికులు సాంకేతిక రంగంలో పనిచేస్తారు. కొందరు అమెరికా సంస్థల్లోనే పనిచేస్తే.. మరికొందరు అమెరికాలోని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఔట్సోర్సింగ్ సంస్థల్లో పనిచేస్తారు. ఈ వీసా విధానంలో జరిగే మార్పులు ఏవైనా భారతీయ ఐటీ ఉద్యోగులు, ఆశావహులతో పాటు.. భారతీయ ఐటీ పరిశ్రమపైనా గణనీయమైన ప్రభావం చూపుతాయి.

హెచ్‌-1బి వీసాతో ట్రంప్ సమస్య ఏమిటి?
హెచ్‌-1బి వీసా విధానం దుర్వినియోగం అవుతోందని, విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా ఉద్యోగులు నష్టపోతున్నారని ట్రంప్‌ పదే పదే విమర్శిస్తున్నారు. కానీ.. అదెలాగో ఆయన వివరించడం లేదు. అయితే.. కనీస వేతన నిబంధనలు వంటి అమెరికా పౌరులకు వర్తించే కొన్ని అమెరికా కార్మిక చట్టాలు హెచ్‌-1బి వీసాదారులకు అదే స్థాయిలో వర్తించవు. ఈ కారణంగా అమెరికా సంస్థలు తక్కువ వేతనానికే పనిచేయడానికి సిద్ధంగా ఉండే విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు మొగ్గు చూపే అవకాశం కొంత ఉండొచ్చు. దీనిని నియంత్రించడానికీ నియమనిబంధనలు ఉన్నాయి. హెచ్‌-1బి వీసాదారులకు మార్కెట్‌ వేతనాల కన్నా తక్కువ వేతనాలు చెల్లించడానికి వీలులేకపోవడం, సదరు సంస్థలో ఉన్న ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను భర్తీ చేయడం కాకుండా.. అదనంగా కొత్త ఉద్యోగులుగా నియమించుకోవడం వంటివి ఆ నిబంధనలు. ఆ నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదని, ఆయా సంస్థలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ అమెరికన్లకు అవకాశాలు నిరాకరిస్తున్నాయన్నది ట్రంప్ చెప్తున్న సమస్య.

భారత ఐటీ పరిశ్రమ ఏమంటోంది?
నిజానికి అమెరికా సాంకేతిక పరిశ్రమ ఇప్పటికే నిపుణులైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోందని, తీవ్రమైన పోటీ కారణంగా అమెరికా పరిశ్రమకు ఈ ఉద్యోగుల అవసరం వేగంగా పెరుగుతోందని భారత సాఫ్ట్వేర్, సర్వీసెస్ సంస్థల సంఘం నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ తాజాగా మీడియాతో పేర్కొన్నారు. హెచ్-1బి వీసాదారులు చౌక కార్మికులని, వారివల్ల అమెరికా ఉద్యోగులకు అవకాశాలు పోతున్నాయని జరుగుతున్న ప్రచారం అంతా అపోహలేనని, అందులో ఏమాత్రం నిజం లేదని ఆయన ఉద్ఘాటించారు. నిజానికి భారతదేశానికి చెందిన 150 బిలియన్ డాలర్ల సాంకేతిక పరిశ్రమ అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తోందని భారత్ చెప్తోంది. ఈ వీసా సంస్కరణల విషయంలో ముందడుగు వేసేక్రమంలో అమెరికా సాంకేతిక పరిశ్రమ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.

హెచ్-1బి సంస్కరణలు తేవాలంటే ఏం చేయాలి?
నిజానికి హెచ్-1బి వీసా విధానం మీద.. అతి తక్కువ వేతనానికే విదేశీ ఉద్యోగులను నియమిస్తున్నారని, లాటరీ విధానంతో అర్హులైన ఉన్నతస్థాయి నిపుణులకు అవకాశాలు తగ్గుతున్నాయని తదితర విమర్శల విషయంలో ట్రంప్ తాజా ఉత్తర్వు చేపట్టిన చర్యలేవీ లేవని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలియమ్ స్టాక్ పెదవి విరిచారు. దీనికి కారణం.. ట్రంప్ చేస్తానని ప్రచారం చేసిన మార్పులు ఏవి చేయాలన్నా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి అని ఆయన వివరించారు. వేతనాల స్థాయిలు, హెచ్-1బి లాటరీ విధానం అన్నీ కాంగ్రెస్ నిర్ణయించినవేనని.. ట్రంప్ వాటిని మార్చాలంటే కాంగ్రెస్ను ఒప్పించాలని పేర్కొన్నారు. ఈ వీసా నియమనిబంధనలను కాంగ్రెస్ 1990 నుంచీ మార్చలేదన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వు ప్రకారం హెచ్-1బి విధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అమెరికా ప్రభుత్వ విభాగాలు సమీక్షించి సిఫారసు చేసిన తర్వాత.. వాటిని అమలు చేయాలంటే చట్టాన్ని మార్చడానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఒబామాకేర్ను తొలగించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమవడాన్ని బట్టి.. సొంత పార్టీ రిపబ్లికన్లే ఆధిక్యంలో ఉన్నా కూడా ఇలాంటి కీలకమైన మార్పుల కోసం వారిని ఒప్పించడం ఎంతకష్టమో తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా ఐటీ పరిశ్రమకు లాభమా? నష్టమా?
అమెరికా ఐటీ పరిశ్రమ కూడా హెచ్‌-1బి వీసా కార్యక్రమంపై అధికంగా ఆధారపడి ఉంది. హెచ్‌-1బి వీసా ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఫేస్‌బుక్‌, క్వాల్‌కామ్‌ సంస్థలు రెండే నియమించుకుంటున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం చెప్తోంది. ట్రంప్ తాను అనుకున్నట్లు హెచ్-1బి వీసాలను మరింతగా నియంత్రిస్తే.. అది అమెరికాకు మేలు చేసే బదులు కీడు చేస్తుందని.. దేశంలో ఐటీ పరిశ్రమ, ఉద్యోగ రంగాలపైనే ప్రతికూల ప్రభావం చూపవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘‘అమెరికా సంస్థలకు అవసరమైన సాంకేతిక నిపుణులు లభించకపోతే.. విదేశాల నుంచి ఉద్యోగులు వచ్చి చేరే అవకాశం లేకపోతే.. ఆ సంస్థలే ఉద్యోగుల వద్దకు వలసపోవాల్సి వస్తుంది. దానివల్ల ఐటీ నిపుణులు ఎక్కువగా అందుబాటులో ఉన్న భారత్, ఐర్లండ్, చైనాలతో పాటు దక్షిణ అమెరికా దేశాలకు సంస్థలను తరలించవచ్చు. ఫలితంగా అమెరికాలో అమెరికన్లకు ఉద్యోగాలు పోతాయి. ఆయా దేశాల వారికి మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి’’ అని విలియమ్ స్టాక్ పేర్కొన్నారు.

(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement