బావిలో కప్పలైపోతున్నాం! | Pawan Kalyan Specail interview with Rentala Jayadeva | Sakshi
Sakshi News home page

బావిలో కప్పలైపోతున్నాం!

Published Mon, Apr 11 2016 1:51 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బావిలో కప్పలైపోతున్నాం! - Sakshi

బావిలో కప్పలైపోతున్నాం!

- పవన్ కల్యాణ్
హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో పవన్‌కల్యాణ్ ఆఫీస్. ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ముందు హాలులో మీడియా ప్రతినిధులు వెయిటింగ్. వెయిటింగ్ హాలు దాటి ఆ డూప్లెక్స్ హౌస్‌లో లోపలికి వెళితే, ఒక చిన్న టేబుల్ మీద చాలా తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు... ఆ పక్కనే పుస్తకాల బీరువా. పక్కనే ఉన్న చిన్నగదిలో బల్లపై విశ్వనాథ సత్యనారాయణ ‘హాహా హూహూ’, గుంటూరు శేషేంద్ర శర్మ ‘ఆధునిక మహాభారతం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, హిందీ, ఇంగ్లీష్ సాహిత్య రచనలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

సోఫాలో పవన్ కల్యాణ్. నిర్మాత, చిరకాల మిత్రుడైన శరత్‌మరార్‌తో మంతనాలాడుతున్నారు.
కోట్ల ఖర్చు, వంద కోట్ల వ్యాపారం చేసిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను ఆఘమేఘాల మీద పూర్తి చేసి, అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేసిన పవన్ అనేక నెలల కష్టం నుంచి కాస్తంత సేద తీరుతున్నారు. ఓపెనింగ్స్‌తో సంచలనం సృష్టిస్తున్న ‘సర్దార్...’ గురించి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యాంశాలు...
 
కంగ్రాట్స్ అండీ! చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకొచ్చారు!
థ్యాంక్స్. కొన్ని నెలలుగా పడ్డ కష్టం తెర మీదకొచ్చేసింది.
 
తెరపై మీ గుర్రపుస్వారీ అదీ చూస్తే, బాగా చేయి తిరిగినట్లుంది!
(నవ్వేస్తూ...) నిజానికి, నాకు గుర్రపుస్వారీ రాదు. ఎప్పుడూ నేర్చుకోలేదు. ‘గబ్బర్ సింగ్’ టైమ్‌లో తొలి సారిగా గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. కింద పడి, తల పగిలితే ఏమిట్రా బాబూ అని కొద్దిగా భయం వేసిందంటే నమ్మండి. అప్పుడు నేను గుర్రం దగ్గరకెళ్ళి దానితో మాట్లాడా. (నవ్వులు..) నాకు గుర్రపుస్వారీ రాదని, సహకరించమని చెప్పుకున్నా. నా కమ్యూనికేషన్ ఏమర్థమైందో ఏమో గుర్రం సహకరించింది. ఒకసారి జీను పెకైక్కి కూర్చున్నాక, నాకు తెలియకుండానే పట్టు దొరికింది. అంతే! ఇక, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి నాకు అలవాటై పోయింది. ముఖ్యంగా ఈ సిన్మాకు వేసిన సువిశాలమైన రతన్‌పూర్ సెట్ ప్రాంగణంలో అటూ, ఇటూ తిరగడానికి గుర్రమే వాడా. షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో రోజుకు అయిదారు సార్లు గుర్రపు స్వారీ చేశా! నాతో పోలిస్తే, అన్నయ్య (చిరంజీవి) అవలీలగా, స్వారీ చేస్తారు. ఆయనకు బాగా వచ్చు. నేను బాగా వచ్చినట్లు నటించాను (నవ్వులు).
 
జీవితంలోనూ, తెర మీదా తుపాకీలకూ, మీకూ అవినాభావ సంబంధంలా ఉందే!
గన్స్... (క్షణమాగి, నవ్వుతూనే...). నేను మొదట ఏమని ఆలోచిస్తానంటే, మనం పని చేస్తున్న విషయం ప్రామాణికంగా ఉండాలనుకుంటా. అందుకనే, ఈ సినిమాలో వాడిన గన్స్ అన్నీ నిజమైన రక రకాల గన్స్ తాలూకు నమూనాలుగా చేయించా. ‘మద్రాస్ రైఫిల్ క్లబ్’లో మెంబర్‌ని. అక్కడి నా పరిచయాలన్నీ వాడుకొని, వాళ్ళ సలహా సూచనలతో ఆ నమూనాలు చేశాం. బేసిక్‌గా మొక్కలు, తుపాకులు బాగా ఇష్టం.
 
ఎర్ర తుండు వేసుకున్నారు. మొక్కలు... తుపాకులా? లేక అడవులు... తుపాకులా?
(నవ్వేస్తూ) ఇప్పటికైతే మొక్కలు, తుపాకులే!
 
మార్షల్‌ఆర్ట్స్‌పై మీ ప్రేమను క్లైమాక్స్‌లో చూపినట్లున్నారు!
అవునండీ! క్లైమాక్స్‌లో విలన్‌తో చేసే ఫైట్‌లో ఫిలిప్పైన్స్‌కు చెందిన మార్షల్ ఆర్ట్ ‘ఎస్‌క్రిమా’ వాడాను. అలాగే, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెంపొందించిన చైనీస్ తరహా కుంగ్‌ఫూ ‘జీత్ కునే డో’ కూడా! ఇవన్నీ ‘జానీ’ సినిమా టైమ్‌లో నేర్చుకున్నా. ప్రత్యర్థిని బ్లాక్ చేయడం, పంచ్ కొట్టడం - రెంటికీ పెద్ద గ్యాప్ ఉండదు.
 
ఇవున్నా ‘ఆగడు’, ‘కిక్2’లతో పోలుస్తూ, విమర్శలొచ్చాయే!
‘తొలిప్రేమ’ సినిమా చేసినప్పుడు కూడా పనికి మాలిన ఆకతాయిల కథ అని విమర్శకులు చీల్చి చెండా డారు. కానీ, సిన్మా బ్లాక్ బస్టర్. ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు. అందర్నీ తృప్తిపరచడమనేది అసాధ్యం. ఏమైనా, ప్రశంసల్లానే విమర్శల్నీ తీసుకోవాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మెచ్చుకొనే వాళ్ళూ, తిట్టేవాళ్ళూ - ఇద్దరూ నాకు సమానం.
 
కానీ, ఒకే రకమైన సిన్మాలు తీస్తుంటే... చూస్తుంటే...?
నిజమే. కానీ ఎవరి సిన్మాలు కొత్తగున్నాయి? మనమెంతసేపటికీ నిర్ణీత వాణిజ్య ఫార్మట్‌లో చిక్కుకుపోతున్నాం. బావిలో కప్పలైపోతు న్నాం. హీరో అంటే పాటలు, ఫైట్లు, డ్యాన్‌‌సలు, కామెడీ చేయాలి. అంచనాలతో వచ్చే ఒత్తిడి అదనం. నాతో సహా ఎవరికైనా ఇదే పరి స్థితి. కానీ, భారతీయ నేపథ్య కథల్ని హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లేతో చెప్పాలి. పాటల్లేని అలాంటి స్వతంత్ర సిన్మాలు మా సంస్థలో తీస్తా.
 
బాహుబలి’ తెలుగు సిన్మాను ఉన్నతశిఖరాలకు చేరిస్తే, ‘సర్దార్...’ మళ్ళీ కిందకు తీసుకుపోయిందన్నట్లు రామ్ గోపాల్‌వర్మ ట్వీట్ చేశారు...
 అలాగా! చూడలేదండీ! వీళ్ళంతా ప్రిడిక్టబుల్ పీపుల్.
 
మీకూ, ఆయనకూ మధ్య ఏమైనా తేడా పాడాలున్నాయా?
(క్షణమాగి) అప్పట్లో ఆయన ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ కథ చెప్పారు. ఆ సిన్మా నేను చేయలేదు. అంతే. అయినా ఆయన విచిత్ర మైన వ్యక్తి. నన్నడిగితే, ఆయన బయటవాళ్ళ మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్ళేవారు.
 
కానీ ఎవరైనా కామెంట్ చేస్తుంటే?
(మధ్యలోనే) సిన్మా గురించైనా, పాలిటిక్స్ గురించైనా కామెంట్ చేయడం చాలా తేలిక. కానీ, పాలి టిక్స్‌లోకొచ్చి జనం ముందు మాట్లాడ్తే తెలుస్తుంది. అంతెందుకు ఆయన్ని (వర్మ) సెక్యూర్టీ లేకుండా విజయ వాడలో నుంచి వెళ్ళమనండి! కుదరదు. ఏమైనా, క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. ఆయన తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను.
 
మీరు ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ కంటిన్యూస్ అన్నారే?
 అవునండీ! చేస్తాం.

ఏంటి? ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండానేనా?
రిజల్టంటే ఏమిటి? ఒక సిన్మాకు ఎంత డబ్బులు పెట్టాం, ఎంత వచ్చాయనేగా! మరీ, నా సినిమా రూ.400 కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టకండి! (నవ్వు)  ఎండ్ టైటిల్స్‌లో చెప్పినట్లు ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ చేస్తాం.
 
మొత్తానికి ‘గబ్బర్‌సింగ్’ని బ్రాండ్‌గా మారుస్తున్నట్లున్నారు!
బ్రాండ్ కాదు కానీ దాన్తో ఎంటర్‌టైనర్స్ తీద్దామని!
 
అసలు ‘గబ్బర్‌సింగ్’ పాత్ర పేరు, తతంగం మీ సృష్టేనట!
హైదరాబాద్‌లో కె.ఎస్.ఎన్. మూర్తి గారని పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనను గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు. ఆ స్ఫూర్తితో నేను ‘గబ్బర్‌సింగ్’ అనే టైటిల్ పెట్టుకొని, హిందీ ‘దబంగ్’ బేసిక్ ప్లాట్ తీసుకొని, కథ, అంత్యాక్షరి సీన్స్ లాంటి వన్నీ వర్క్ చేశా. ఫోటో షూట్ చేశాక, దర్శకుడు హరీశ్ శంకర్‌ను పిలిచి, సిన్మా అప్పగించా. అలా ‘గబ్బర్‌సింగ్’ వచ్చింది.
 
ఇంతకీ, ‘సర్దార్...’ను హిందీలో రిలీజ్ చేయడంలోని ఆలోచన?
మన తెలుగు సినిమాల్ని హిందీలోకి డబ్బింగ్ చేసి, వాటిని ‘జీ’ టీవీ లాంటి వాటిలో విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. జనమూ చూస్తున్నారు. అలాంటప్పుడు మన సిన్మాను మనమే హిందీలోకి డబ్ చేసి, రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా! తెలుగు సిన్మా మార్కెట్‌ను విస్తరించడానికి ఎవరో ఒకరు ఇలాంటి ప్రయత్నం చేయాలి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో నేను చేసింది అదే! ఈ ప్రయత్నం సక్సెసా, కాదా అన్నది తర్వాత! ముందుగా ఎవరో ఒకరు ఇలాంటివి ప్రయత్నించాలి. వంద సినిమాలతో ప్రయత్నిస్తే, 101వ దానితోనైనా తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది నా సిన్మా అయినా, కాకపోయినా ఫరవాలేదు. కానీ, మన సినిమాకు మార్కెట్ పెరగడం ముఖ్యం. ఇది ఆ ప్రక్రియలో భాగం.
 
నెక్స్‌ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు?
త్వరలోనే! ఎస్.జె. సూర్య దర్శకుడు.
 
మీ కాంబినేషన్‌లో ‘ఖుషి’కి ఇది సీక్వెలా?
లేదు. ఇది వేరే. ఫ్యాక్షనిస్ట్ లవ్‌స్టోరీ.
 
త్రివిక్రమ్‌తో ‘కోబలి’ చిత్రం చేస్తారన్నారు.
ఆ కథ గురించి, అది ఎప్పుడు పట్టాల మీదకు ఎక్కుతుందనేది త్రివిక్రమ్ గారు చెప్పాలి! మీరు ఆయన్ని అడగాలి (నవ్వులు).
 
మీరు నిర్మాతగా - చరణ్‌తో, మీరు హీరోగా దాసరితో చేస్తామన్న సిన్మాల మాటేమిటి?
అవి చేయాలండి! దాసరి గారు కథ సిద్ధం చేయిస్తున్నారు. కథ పూర్తి అయ్యాక తప్పకుండా చేస్తాం. కానీ, నెల నెలా ఖర్చులు గడవడం కోసం సిన్మాలు చేయాల్సి వస్తోంది. కానీ, మరో రెండు, మూడు చేశాక మానేస్తా.
 
‘సర్దార్ గబ్బర్‌సింగ్’కు 35 కోట్లు తీసుకున్నారట!
 అది నిజం కాదు. అంత తీసుకోలేదు.
 
తెలుగులో అత్యధిక పారితోషికపు హీరో మీరేనంటే...
యస్. అయామ్! హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకొంటున్నా. ట్యాక్స్ వాళ్ళనడిగితే చెబుతారు.
 
ఇంతకీ మీరు ఎంత రిచ్? ఎంత పూర్?
ఇన్‌కమ్ ట్యాక్స్ బ్యాలెన్‌‌సషీట్ చూస్తే 20 కోట్లు డెఫ్సిట్.
 
మరి సిన్మాలు మానేస్తే ఎలా? ఫ్యాన్స్, ప్రేక్షకులేమవుతారు?
‘ఖుషి’ టైమ్‌లోనే 2-3 సినిమాలు చేసి మానేద్దామ నుకున్నా. కుదరలేదు. ఇప్పుడిక పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకొంటున్నా. భార్యాబిడ్డల జీవితం గడవడానికి కావాల్సిన కొద్ది డబ్బు సంపాదించి, సిన్మాలు మానేస్తా. రాజకీయాల్లో నేను నాలా ఉండచ్చు. సిన్మాల్లో అలా కాదు.
 
మీ అబ్బాయి అకీరా ఈ సిన్మా చూశాడా? ఏమన్నాడు?
లేదండీ! చూడలేదు. నేను కూడా వాళ్ళను చూసి, 4 నెలలైంది. ఈ సినిమా బిజీలో పడి వెళ్ళలేదు. పిల్లలు బెంగ పడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజునే వాడి పుట్టినరోజు కూడా! మర్చిపోయాను. సాయంత్రం గుర్తొచ్చి ఫోన్ చేసి, సారీ చెప్పాను. రేపో, ఎల్లుండో పుణే వెళ్ళి, చూసొస్తా.  
 
ఇంతకీ మీరు పవర్‌స్టారా? పవర్ మేకరా? పవర్ మాంగరా?
(నవ్వేస్తూ...) ఇవేవీ కాదు. నేను వట్టి పవన్ కల్యాణ్‌ని! అంతే!

- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement