మనం బతికేం ప్రయోజనం?: సూపర్‌స్టార్
దేశాన్ని కుదిపేస్తున్న జెఎన్‌యూ వివాదంపై మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భావోద్వేగభరితంగా స్పందించారు. జాతీయవాదాన్ని ప్రస్తావిస్తూ ఆర్మీ, జవాన్లు చేస్తున్న వీరోచిత త్యాగాలను కొనియాడారు. అదే సమయంలో జాతీయవాదం, స్వేచ్ఛ అంటూ దేశంలో సృష్టిస్తున్న రభసను ప్రస్తావించారు. 'భారతదేశమే చనిపోతుంటే మనం బతికి ఏం ప్రయోజనం?' అన్న శీర్షికతో మోహన్‌లాల్ తాజాగా తన బ్లాగ్‌లో ఓ ఆర్టికల్ రాశారు. దేశ రక్షణలో భాగంగా సియాచిన్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలొదిలిన అంశాన్ని ఆయన ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన లాన్స్ నాయక్ సుధీష్ భౌతికకాయాన్ని ఆయన నాలుగేళ్ల కూతురికి చూపిస్తున్న ఫొటోను చూసి తాను చలించిపోయానని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశ పౌరులు ఇంట్లో సుఖంగా కూర్చొని స్వేచ్ఛ, జాతీయవాదాలపై లెక్చర్లు దంచడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
'చలికాలం వస్తుందన్న సంకేతం రావడంతోనే మనం మందపాటి దుప్పట్లలో దూరిపోతాం. వేడినీళ్లతో పళ్లు తోముకొని స్నానం చేస్తాం. ఇలాంటి సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ మనం కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లి మన సైనికుల గురించి చర్చిస్తాం. వారిని దుర్భాషలాడుతాం. వారిని ప్రశ్నిస్తాం. మన దేశమంటే మనం ఉండటానికి తిరగడానికి వీలైన ఈ నేల. మన తలపై ఉన్న ఆకాశం. మనం పీల్చే గాలి. మనం తాగే నీరు. మనం చనిపోయాక మనతో ఏకమయ్యే ఈ ఆరడుగుల నేల' అంటూ ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలతో తెరపైకి వచ్చిన జెఎన్‌యూ వివాదంపై ఆయన నేరుగా స్పందించలేదు. తాను దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదన్న మోహన్ లాల్.. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేశమంటే, స్వేచ్ఛ అంటే ఏమిటో నిజమైన అర్థాన్ని వివరించాలని కోరారు. స్వేచ్ఛను గౌరవించడం ముఖ్యమే అయినా దానిని పొందేందుకు చెల్లించే మూల్యాన్ని కూడా గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.