ఆ పాట.. ఆయన.. చిరంజీవులు | Writer modukuri johnson anniversary | Sakshi
Sakshi News home page

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు

Published Wed, Dec 24 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు

సందర్భం: రచయిత మోదుకూరి జాన్సన్ వర్ధంతి
 
 ఎన్టీఆర్ ‘పాండురంగ మాహాత్మ్యం’లోని ‘హే కృష్ణా! ముకుందా!’ పాట లాగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటూ, దయ, ప్రేమ, దుఃఖం, కరుణ - ఇలా అన్ని రకాల ఛాయలూ ప్రతిఫలించేలా పాటలో వేదన కనపడాలని చెప్పా. మోదుకూరి మారుమాట్లాడకుండా టవల్ మీదే బాత్‌రూమ్‌లోకి వెళ్ళి, షవర్ కింద నీళ్ళలో దేవుణ్ణి కన్నీటితో ప్రార్థిస్తూ, తడిసి ముద్దై వచ్చి, మరొక్క ఛాన్సిస్తే రాసిస్తానన్నారు. నేను సరేనన్నా. అలా షవర్ కింద నీటిలో తన కన్నీటిని దాచుకొని, ఆయన రెండోసారి రాసిందే - ‘కదిలింది కరుణరథం..’ అన్న సూపర్‌హిట్ పాట.
 
 ‘కరుణామయుడు’ సినిమాకు సంబంధించి నాకెన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది రచయిత మోదుకూరి జాన్సన్‌తో ఆ సినిమాకు సాగిన ప్రయాణం... ఆ చిత్రానికి ఆయన మాటలు, ‘కదిలింది కరుణరథం...’ పాట రాసిన సందర్భం. మోదుకూరి, నేను - ఇద్దరం రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చినవాళ్ళమే. ఆయనతో నాకు అప్పట్లో పరిచయం లేదన్న మాటే కానీ, మోదుకూరి రాసిన ‘నటనాలయం’ నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే ఏయన్నార్ - ఆదుర్తి సుబ్బారావులు తమ సొంత చిత్రం ‘మరో ప్రపంచం’తో ఆయనకు సినీ రచయితగా అవకాశమిచ్చారు.
 
  నటుడిగా నాకూ అదే తొలి చిత్రం. అలా అప్పటి నుంచి ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం. ‘కరుణామయుడు’కి మాటల రచనకు క్రీస్తు జీవితం, సందేశాలతో పరిచయమున్న రచయిత అయితే బాగుంటుందని అనుకున్నాం. నేను, నా భాగస్వామి సజ్జల చిట్టిబాబు కలసి మోదుకూరి గారైతే బాగుంటుందని తీసుకున్నాం. ‘అమృతవాణి’ సంస్థ తరఫున ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో ఆంగ్లంలో తయారు చేసిన ఇంగ్లీషు స్క్రిప్టు ఆధారంగా ముగ్గురం ముందుకు సాగాం. దాదాపు 13 గంటల నిడివి గల స్క్రిప్టును ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా 2 గంటల 45 నిమిషాల నిడివికి కుదించాం.
 
 మోదుకూరి అప్పటికే పేరున్న రచయిత. పెద్ద చిత్రాలకు కథ, మాటలు అందించారు. అయితే క్రీస్తు కథ కాబట్టి, ఈ చిత్ర రచనా విధానం గురించి ఆయనతో మాట్లాడడానికి నేను, చిట్టిబాబు గారు వెళ్ళాం. క్రీస్తు మీద చిత్రం కాబట్టి, ప్రత్యేకంగా ధ్వనించే క్రైస్తవ తెలుగులో మాటలు రాస్తానన్నారాయన. అయితే, నేను మాత్రం వద్దని వాదించా. ‘‘మనం ఈ సినిమా తీస్తున్నది కేవలం క్రైస్తవుల కోసం కాదు. క్రైస్తవేతరులతో సహా అందరూ చూడడం కోసం! కాబట్టి, అందరికీ అర్థమయ్యే సులభమైన తెలుగులో రాయాలి’’ అన్నా. చివరకు క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్‌కు చెందిన ఫాదర్ బాలగర్ (స్కాట్లండ్) కూడా నన్ను సమర్థించారు. మోదుకూరి గారు కూడా మా వాదనలోని అంతరార్థాన్ని గ్రహించి, అంగీకరించారు. మామూలు తెలుగులో మాటలు రాశారు. ‘కరుణామయుడు’ రిలీజయ్యాక ఆ మాటలు, ఆ శైలి తరువాతి క్రీస్తు చిత్రాలకు ఒక ఒరవడి పెట్టాయి.
 
 అలాగే, ఆ చిత్రాన్ని అందరిలోకీ తీసుకువెళ్ళిన పాట - ‘కదిలింది కరుణరథం...’. క్రీస్తు జననం నుంచి పునరుత్థానం వరకు అన్నీ ఉండే ‘కరుణామయుడు’లో అతి కీలకమైన పాట - యేసు క్రీస్తు శిలువ మోస్తూ పాడే ఆ గీతం. అది సినిమాకు గుండెకాయ. నిజానికి, ఆ పాటను మోదుకూరితో రాయించాలనుకోలేదు. ఆయన రాసిన మొదటి వెర్షనూ అది కాదు. అసలు ఆ పాటను శ్రీశ్రీ, ఆత్రేయల్లో ఎవరితోనైనా రాయించాలని నా ఆలోచన. ఆ చర్చ జరుగుతున్నప్పుడు మోదుకూరి గారు ‘చూడు విజయ్! ఆ కీలకమైన పాట నేను రాస్తా. నచ్చితే పెట్టుకో’ అన్నారు. అప్పటికే ఆయన ‘దేశోద్ధారకులు’ (‘స్వాగతం దొరా...’ పాట) లాంటి చిత్రాల్లో పాటలు రాశారు. నాకంత ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా. మంచి గాయకుడు కూడా అయిన మోదుకూరి పిలిచారు. ఆయన ఏదైనా రచన చేస్తున్నా, వినిపిస్తున్నా తెల్లటి టర్కీ టవల్ కట్టుకొని, మంచం మీద బాసింపట్టు వేసుకొని చెప్పేవారు. ఆ పాట చాలా చెత్తగా ఉందంటూ ఆ మాటే ఆయనకు మొహం మీద చెప్పేశా.
 
  ఆయన రెండోసారి రాసిన వెర్షనే - ‘కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం... మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగె కాంతిపథం...’ అన్న సూపర్‌హిట్ పాట. కులమతాలకు అతీతంగా ‘కరుణామయుడు’ అందరికీ చేరువ కావడానికీ, అంత బాగా ఆడడానికీ - ఎంతో తాత్త్వికత, క్రీస్తు జీవిత సారమున్న ఆ పాట ఓ కారణం. నిడివి ఎక్కువగా ఉండే ఈ పాటను డబుల్ పేమెంట్ ఇచ్చి, మద్రాసు విజయా గార్డెన్స్‌లో సంగీత దర్శకుడు జోసెఫ్ వి. కృష్ణమూర్తి, బి. గోపాలం సంగీతంలో రికార్డింగ్ చేయించడానికి చేతిలో తగినంత డబ్బులు లేక అవస్థ పడ్డాను. దేవుడి మీద భారం వేస్తే, ఆటలో డబ్బులొచ్చాయి. అలా ఆ పాట రికార్డింగ్ చేశాం. ఎస్పీబీ తక్కువ పారితోషికం తీసుకొని పాడారు. ఇక, వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ జరపాలని మొదటే బరువైన కొయ్య శిలువ తయారు చేయించాం. ప్రతి లొకేషన్‌లో కొద్దిగా తీశాం. అలా షూటింగ్ జరిగినన్ని రోజులూ అన్ని చోట్లకూ ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళాం.
 
 ఎన్నో ఇబ్బందుల మధ్య నాలుగేళ్ళు నిర్మాణంలో ఉండి, 1978 డిసెంబర్‌లో విడుదలైన ‘కరుణామయుడు’ మా జీవితాలనే మార్చేసింది. తరువాత నేను తీసిన ‘దయామయుడు’, ‘ఆంధ్రకేసరి’ చిత్రాలకూ మోదుకూరే రచయిత. అలాగే, బాపు-రమణల ‘రాజాధిరాజు’లో ఆయన రాసిన ‘రాజ్యము బలము మహిమ నీవే నీవే...’ పాట కూడా సుప్రసిద్ధం. వ్యక్తిగా ఎంతో మంచివాడు, అభ్యుదయ భావాలున్న మోదుకూరికి ఇవాళ్టికీ రావాల్సినంత గుర్తింపు, పేరు రాలేదు. యాభై ఏళ్ళ వయసుకే ఆయన అర్ధంతరంగా మరణించడంతో ఒక మంచి రచయితను కోల్పోయాం. కానీ, ‘కరుణామయుడు’తో పాటు ఆయన, ఆయన పాట చిరంజీవులే!
 (సంభాషణ- రెంటాల జయదేవ)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement