ప్రధాని మోదీ చైనా వెళ్లడానికి ముందే...
కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణ ముహూర్తం ఖరారు
ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణకు ఈనెల 3న ముహూర్తం ఖరారయింది. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు బయలుదేరనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం చైనా పర్యటనకు వెళుతున్నందున ఏ క్షణమైనా కేబినెట్ పునర్వ్యస్థీకరణ ఉంటుందని గురువారం వార్తలు వచ్చాయి.
అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆదివారం ఉదయం ముహూర్తం ఖరారు చేసినట్టు అధికార వర్గాలు వివరించాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరుపుతున్న మూడో మంత్రివర్గ విస్తరణ ఇది.