గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
- ఆలస్యమైతే పన్నీర్‌కు లాభం
- వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళకు ఉపయుక్తం
న్యూఢిల్లీ: తమిళ రాజకీయ చదరంగంలో సీఎం కుర్చీకోసం సాగుతున్న గేమ్ క్లైమాక్స్‌కు చేరింది! ముఖ్యమంత్రి పీఠంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూర్చుంటారా? లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని పదవి వరిస్తుం దా? ఇప్పుడిది రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ నిర్ణయానికి తీసుకునే కాలవ్యవధి కూడా ఇద్దరి జాతకాలను తారుమారు చేయగలదని పలువురు విశ్లేషిస్తున్నారు. గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళకు లాభిస్తుందని, ఆచితూచి అడుగులేస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్తే నిర్ణయంలో జాప్యం జరుగుతుందని, తుదకు అది పన్నీర్‌కే ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు.
‘విచక్షణ’ ఎటువైపో...?: ఆర్టికల్ 163(2) గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలను కట్టబెట్టింది. తమిళనాడులో తాజా పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చిన గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ విచక్షణా ధికారానికి కూడా పరిమితులు ఉంటాయంటూ కిందటేడాది అరుణా చల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌కోవా తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. 2016 జనవరి 14 నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను ఒక నెల ముందుగానే (2015 డిసెంబర్ 16న) జరపాలన్న ఆయన నిర్ణయాన్ని కొట్టివేసింది. ‘‘మెజారిటీ ఎమ్మెల్యేలున్న ఒక పార్టీ తమ నేతను ఎన్నుకుంటే రాజ్యాంగం ప్రకారం ఆ ఎన్నికైన నేతతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలి.
కానీ కొన్ని పరిస్థితుల్లో తన విచక్షణ మేరకు గవర్నర్ కొన్ని రోజులు ఈ ప్రక్రియను ఆపొచ్చు. ‘ఫలానా కారణం చేత నేను మరికొన్ని రోజులు వేచి చూస్తా..’ అని చెప్పే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంది. అయితే అది రాజ్యాంగబద్ధమా? కాదా? అన్నది ఇప్పటిదాకా తేలలేదు’’ అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. శశికళకు ఉపయుక్తంగా ఉంటుంది. గవర్నర్ తన విచక్షాధికారాన్ని వినియోగించుకోకుండా నిలువరించే అధికారం ఎవరికీ లేదు. అవసరమైతే నిర్ణయం తర్వాత దానిపై కోర్టుకు వెళ్లొచ్చు. గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని శశికళ భావిస్తుండగా.. ఎంత ఆలస్యమైతే అంత మంచి దని సెల్వం చూస్తున్నారు.
ఆ ఆర్టికల్ ఏం చెబుతుంది?: ‘‘రాజ్యాంగానికి లోబడి గవర్నర్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన విచక్షణాధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు’’ అని ఆర్టికల్ 163(2) చెబుతోంది. ‘రాజ్యాంగానికి లోబడి’ అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నందున ఆయన తీసుకునే నిర్ణయం..రాజ్యాంగ పరీక్షకు నిలవాల్సి ఉంటుందంటున్నారు న్యాయనిపుణులు. ‘‘ఒక పార్టీలోని అంతర్గత సంక్షోభాలు, కీచులాటలతో సంబంధం లేకుండా గవర్నర్ వ్యవహరించాలి. పార్టీ విషయా లతో సంబంధం లేకుండా ఆయన నిర్ణయం తీసుకోవాలి’’ అని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తమిళనాడులో గవర్నర్ తన విచక్షణ మేరకు తీసుకోబోయే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటే మాత్రం కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని నిపుణులు విశ్లేషిస్తు్తన్నారు.