స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించడంపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షనేత స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'అక్రమాస్తుల కేసులో చివరికి న్యాయమే గెలిచింది. ఎంత కాలం గడిచినా చివరికి న్యాయమే గెలుస్తుందని ఈ కేసు తీర్పు మరోసారి నిరూపించింది. అక్రమాలకు పాల్పడి ప్రజల్లో కలిసిపోయి స్వేచ్ఛగా తిరగలేరని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలి' అని స్టాలిన్ అన్నారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వెంటనే స్పందించాలని ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఈ సందర్భంగా స్టాలిన్ కోరారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రాజకీయ సంక్షోభానికి తెరదించాలన్నారు. ప్రత్యక్షంగా తమ మద్ధతు తెలపకపోయినా.. పరోక్ష రాజకీయాలు నడుపుతూ పన్నీర్ సెల్వానికి మద్ధతిస్తూ.. శశికళకు వ్యతిరేకంగానే డీఎంకే శ్రేణులు వ్యవహరిస్తూ వచ్చాయి. శశికళతో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని కూడా సుప్రీంకోర్టు తాజా తీర్పులో దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.