చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మంత్రి పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని సమాచారం. గవర్నర్ ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
నిన్న (మంగళవారం) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా ప్రకటించాక.. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా గవర్నర్‌ను కోరినా ఆయనకు తగినంత ఎమ్మెల్యేల బలం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్.. పళనిస్వామికి అవకాశం ఇస్తారని సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు మరిన్ని అప్‌డేట్స్ చూడండి..