చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.. ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు న్యాయ సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, సభలో ఎవరికి మెజార్టీ ఉంటే వారినే సీఎంను చేయాలని గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. అసెంబ్లీలో ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది సభ సాక్షిగా తేలాలని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాసాగర్ రావుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహిస్తే పారదర్శకంగా, ప్రజాస్వామ్యంగా జరుగుతుందని అటార్నీ జనరల్ భావిస్తున్నారు. కాగా సభలో బలపరీక్షకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేదా అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మెజార్టీ నిరూపించుకోమని ఆమెకు చెబుతారా అన్నది తేలాల్సివుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గవర్నర్ తొలుత పన్నీరు సెల్వంకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. గవర్నర్ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ వర్గీయులు తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సంచలన ప్రకటన చేసిన పన్నీరు సెల్వం.. సభలో బలప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. మరోవైపు అన్నాడీఎంకే శాసన సభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడింది.