గవర్నర్ కు ముందే తెలుసా?
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. శశికళతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా నిర్ధారించింది. దీంతో తమిళ రాజకీయ డ్రామాకు నేటితో తెరపడనుంది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శశికళ వర్గానికి సుప్రీం తీర్పు మింగుడు పడటం లేదు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 5న సీఎం పదవికి పన్నీర్ రాజీనామా చేసినా గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం శశికళకు చాన్స్ ఇవ్వకపోవం వెనక ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి.
వాస్తవానికి పన్నీర్ రాజీనామా తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు తనకుందని తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును నేరుగా కలిసి అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగా రెండు పర్యాయాలు ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాశారు. అయినా విద్యాసాగర్ రావు నుంచి ఆమెకు స్పందన కరువైంది. దీన్నిబట్టి చూస్తే గవర్నర్ కు జరగబోయే పరిణామాలు ముందే తెలిసినందు వల్లే తన నిర్ణయాన్ని వాయిదావేస్తూ వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని వెల్లడించకుండా జాప్యం చేస్తూ తెలివిగా వ్యవహరించారని, ఇందులో భాగంగానే కేంద్ర సలహా కోరారన్న వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని త్వరగా తెరదించాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో గతవారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో వెలువడే తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను అంగీకరించినా శశికళకు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి.. మెజార్టీ నిరూపించుకునే చాన్స్ మాత్రం ఇవ్వక పోవటం.. ఆయనకు ఈ కేసులో తీర్పు ఎలా రానుందో ముందే తెలిసి ఉండొచ్చునని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్దోషిగా తేలితే మాత్రం ప్రమాణ స్వీకారానికి శశికళను ఆహ్వానించేవారని, అలాంటి పరిస్థితులు లేవని తీర్పు వచ్చే వరకు తన నిర్ణయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు వాయిదా వేస్తూ వచ్చారు.