టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం!
ఇండోర్: టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. కిలో టమాట వంద రూపాయలపైనే అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటాలను దొంగల బారి నుంచి కాపాడుకోవడం వ్యాపారులకు సవాల్‌గా మారింది. ధర అమాంతంగా పెరగడంతో ఇక్కడ టమాట దొంగతనాలు మొదలయ్యాయి. టమాటాలు చోరీకి గురికాకుండా చూసేందుకు కూరగాయల వ్యాపారులు ప్రత్యేకంగా సెక్యురిటీ గార్డులను కాపాలా పెడుతున్నారు. సాయుధులైన భద్రతా సిబ్బందిని నియమించి టమాటాలు చోరుల బారిన పడకుండా చూసుకుంటున్నారు.
ఈ నెల 20న ముంబైలోని దాహిసార్ కూరగాయాల మార్కెట్ 300 కిటోల టమాటాలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతమున్న ధర ప్రకారం చూస్తే వీటి విలువ అక్షరాలా 70 వేల రూపాయలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. పంట దెబ్బతినడంతో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.100 నుంచి రూ. 120 వరకు పలుకుతోంది. ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్ వరకు టమాట ధరలు దిగివచ్చే అవకాశం లేదన్న వార్తలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.