బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు | Modi told me to shut up when I asked questions, says Maharashtra BJP MP | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Published Sun, Sep 3 2017 10:54 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు - Sakshi

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, నాగ్‌పూర్‌: ప్రభుత్వ వ్యూహాల గురించి పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ప్రధానమంత్రి మోదీకి నచ్చదని మహారాష్ట్ర బీజేపీ ఎంపీ నానా పటోల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటేరియన్ల సమావేశంలో తాను రైతుల సమస్యలను లేవనెత్తగా మోదీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. గ్రీన్‌ ట్యాక్స్‌ను పెంచాలని, వ్యవసాయ రంగాల్లో కేంద్రం పెట్టుబడులను పెంచాలని, ఓబీసీలకు ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని తాను సమావేశం మాట్లాడానని తెలిపారు. తన ఆలోచనలను అభినందించని మోదీ.. 'కొంచెం నోరు మూసుకుంటావా' అని అడిగారని చెప్పారు.

'మీరు పార్టీ మ్యానిఫెస్టోను చదివారా?.. ప్రభుత్వ పథకాల గురించి మీకు తెలుసా?' అని మోదీ తనను ప్రశ్నించారని తెలిపారు. గోండియా-భందారా నియోజకవర్గం నుంచి నానా పటోల్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాయకుడు ప్రపూల్‌ పటేల్‌పై గెలుపొందారు. అయితే, తాజాగా బీజేపీ ప్రపూల్‌ పటేల్‌తో సన్నిహితంగా ఉంటుండటంతో ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ తనను టార్గెట్‌ చేసిందని శుక్రవారం ఆయన ఆరోపించారు. తనకేం భయం లేదని అన్నారు. తనకు మంత్రి కావాలని లేదని, ప్రస్తుతం ఉన్న మంత్రులు భయంతో బతుకుతున్నారని అన్నారు. కాగా, ఓ బీజేపీ ఎంపీ ప్రధానమంత్రిని విమర్శించడం ఇదే తొలిసారి.

నానా పటోల్ స్టేట్‌మెంట్స్‌పై మాట్లాడేందుకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిరాకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా రైతుల బాధలను తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు నానా పటోల్‌. కేంద్రం నుంచి రైతులకు సాయం తెవడంలో సీఎం విఫలం చెందారని అన్నారు. కేవలం నిధుల కొరత వల్లే విదర్భ ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ అటకెక్కాయని చెప్పారు. ఫడ్నవీస్‌ ప్రాంతమైన నాగ్‌పూర్‌కు మాత్రమే నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు. నాగ్‌పూర్‌కు మెట్రోరైలు, కొత్త పరిశ్రమలు వస్తుండటం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement