శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా?
అంతేకాదు.. నిజంగానే స్వచ్ఛందంగా శశికి మద్దతుగా 119మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నారని ప్రభుత్వం తరుపు ప్రతినిధి ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇప్పుడా 119మంది ఎమ్మెల్యేల దారి ఎటు? ఈ తీర్పు తర్వాత శశికళ కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగువేసి తనతో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తారా? లేదంటే భవిష్యత్ మరింత చీకటిగా మారుతుందేమో అనే భయంతో మధ్యేమార్గంతో రాజీయత్నాలకు దిగుతారా? ఒక వేళ ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుకు తెస్తే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అయితే, ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మన్నార్ గుడి వర్గం సెంగుట్టయన్ పేరును ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేపథ్యంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే బావుంటుందని ఆమె వర్గం భావిస్తోందట.
అంతేకాదు, చాలామంది ఎమ్మెల్యేలు తనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పళనిస్వామినికానీ, సెంగొట్టయన్‌ను కానీ, ముఖ్యమంత్రిగా కొనసాగించే యోచనలో శశికళ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా, జయ మేనళ్లుడు దీపక్ జయకుమార్‌కు కూడా ముఖ్యమంత్రిగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏదీ ఏమైనా తాను కాకుంటే ముఖ్యమంత్రిగా మరో వ్యక్తిని పెడదాం అనే ప్లాన్ బీ శశిదగ్గర అసలు ఉందా లేదా అనేది తర్వాత పరిణామాలు తెలిసే వరకు కూడా అనుమానమే.