పన్నీర్‌సెల్వం దూకుడు
- ప్రభుత్వం, పార్టీని చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు
- ప్రభుత్వంలో శశికళ విధేయులపై వేటు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల అండతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు మరింత పెంచారు. ఆయన విసురుతున్న రాజకీయ పాచికలను కాచుకోలేక శశికళ శిబిరం విలవిల్లాడుతోంది. మొన్నటి దాకా ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న పన్నీర్ గురువారం నుంచి పార్టీని కూడా హస్తగతం చేసుకునే దిశగా రాజకీయ సమీకరణలకు తెరలేపారు. ప్రభుత్వంలో శశికళ విధేయులపై వేటు వేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తద్వారా అధికార వర్గాల మద్దతును కూడగడుతున్నారు. శశికళ ప్రస్తుతం నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ ఇంటిని జయలలిత స్మారక భవనంగా మారుస్తా మని పన్నీర్ సెల్వం ప్రకటించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను దిమ్మ తిరిగేలా చేసి ఆత్మరక్షణలో పడేశాయి. పన్నీర్‌సెల్వం పార్టీ వ్యతిరేకి, పార్టీ ద్రోహి అంటూ శశికళ వర్గం చేస్తున్న ఆరోపణలు జనంపై పెద్దగా ప్రభావం చూపడం లేదు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్
ఇన్నాళ్లూ శశికళ మద్దతుదారుడిగా ఉన్న అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అనూహ్యంగా పన్నీర్ సెల్వం పక్షాన చేరిపోయారు. ఎమ్మెల్యేలంతా పన్నీర్ వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అమ్మ’ ఆత్మ ఇచ్చిన ఆదేశాల మేరకు మధుసూదనన్‌ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని పన్నీర్‌సెల్వం ప్రకటిం చారు. అన్నాడీఎంకేలో జయలలితకు ప్రతినిధిగా పార్టీ వ్యవహారాలన్నీ నడిపిన మధుసూదనన్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం శశికళకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
పన్నీర్‌కు పార్టీల మద్దతు
పన్నీర్ సెల్వంకు శాసన సభలో బలనిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ గురువా రం ఒక ప్రకటన ద్వారా గవర్నర్‌ను కోరారు. బల నిరూపణకు అవకాశం ఇస్తే తాము మద్దతు ఇస్తామని ఈ చర్య ద్వారా స్టాలిన్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా పన్నీర్‌కు మద్దతు ప్రకటించడం శశికళను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. బీజేపీ సైతం పన్నీర్‌కు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ అంచనా వేసుకున్నందు వల్లే పన్నీర్ సెల్వం రెండు రోజులుగా ధీమాగా కనిపిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చాక ఆయన మరింత ధీమాగా కనిపించారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆయనకే అనుకూలంగా ఉంటుందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.