
న్యూఢిల్లీ: రెండోసారి అధికారపగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా శనివారం మొత్తం 56 మంత్రిత్వ శాఖలతో సమావేశమై, మంత్రుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, వారి ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, సాగు సహా వివిధ రంగాల విధానాలను రూపొందించాలని కోరారు. చాణక్యపురిలోని ప్రవాసి భారతీయ కేంద్రంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారిగా అన్ని మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. అదే స్థాయిలో మరోసారి భేటీ చేపట్టారు. కాగా, వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ తర్వాత చేపట్టబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఈ సమావేశమే ప్రాతిపదిక కానుందని భావిస్తున్నారు.
ఏం చర్చించారు?
ముఖ్య పథకాల అమలు తీరు, మిషన్ 2022లో చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపైనా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ప్రతి ఇంటికీ తాగునీరు, అందరికీ ఇళ్లు, ఆయుష్మాన్ భారత్, టీకా కార్యక్రమం తదితరాలను సమీక్షించారు. మంత్రుల నుంచి సలహాలు స్వీకరించడంతోపాటు ఆర్థిక మందగమనం, బడ్జెట్‌పైనా సమాలోచనలు సాగాయి. పలువురు మంత్రులపై అదనపు శాఖల బాధ్యతలతో పనిభారం ఉండటం, కొందరి పనితీరు సంతృప్తికరంగా లేకపోవడానికి సంబంధించి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా చర్చ జరిగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment