కొత్త ‘రాష్ట్రపతి’ గతంలో రెండుసార్లు ఓడారు
న్యూఢిల్లీ: ఎవ్వరూ ఊహించని విధంగా బిహార్ గవర్నర్, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీయే అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. మత విషయాలకంటే తమ జాతి ప్రయోజనాలకోసం, బడుగు వర్గాల సాధికారతకోసమే పనిచేశారు. ఓసారి కేంద్రం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక చట్టం తెచ్చినప్పుడు ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నారు. ప్రచార ఆర్భాటమూ తక్కువ. సౌమ్యమనస్తత్వం కలిగి ఉండటంతోపాటు పార్టీ అధిష్టానంతో కూడా ఆయనకు మంచి పేరుంది. ఈయన కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సన్నిహితుడు కూడా.
అయితే, కోవింద్ గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. తమ పార్టీలో చేరిన రామ్‌నాథ్‌ను తొలిసారి బీజేపీ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి కోవింద్ తొలిసారి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసినా ఓటమిని చవిచూశారు.
అయితే, ఆయనకు ఉన్న సంస్థ నిర్వహణా, పరిపాలన నైపుణ్యాలను గమనించిన పార్టీ మాత్రం ఆయనను పక్కన పెట్టలేదు. దీంతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను బిహార్ గవర్నర్‌గా నియమించింది. దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో గవర్నర్‌లకు ముఖ్యమంత్రులకు విభేదాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు రామ్‌నాథ్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మధ్య ఒక్క విభేదంగానీ, వాదులాట, వివాదంగానీ తలెత్తలేదంటే ఆయన పరిపాలన నైపుణ్యాలేమిటో అంచనావేసుకోవచ్చు.