సహార పత్రాల్లో మోదీతోపాటు వీరి పేర్లు కూడా...
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహార గ్రూప్ నుంచి ముడుపులు తీసుకున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఇరువురి మధ్య వ్యాగ్యుద్ధం చెలరేగుతున్నప్పటికీ ఎవరు కూడా వాస్తవాలను ప్రస్తావించడం లేదు. సహార గ్రూపు పత్రాలను తవ్వి మోదీ పేరును వెలికితీసిన రాహుల్ గాంధీ మోదీతోపాటు ఆ పత్రాల్లో ఉన్న ఇతర పేర్లను ఎందుకు ప్రస్తావించడం లేదు? రాహుల్ గాంధీ మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేదంటూ వ్యంగ్యోక్తులు విసిరిన మోదీ తనపై నేరుగా చేసిన ఆరోపణలను నేరుగా ఎందుకు ఖండించడం లేదు?
ఎవరెవరి పేర్లున్నాయంటే....
సహార గ్రూప్‌పై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏ రాజకీయ పార్టీకీ, ఏ సీఎంకు ఏ రోజున ఎన్ని ముడుపులు ఇచ్చారన్న వివరాలు మొత్తం 11 పేజీల్లో ఉన్నాయి. ‘సీఎం చత్తీస్‌గఢ్’కు 2013, అక్టోబర్ 1వ తేదీన నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చామని సహార పత్రాల్లో ఎంట్రీ ఉంది. సీఎం అనే అక్షరాలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినవే అయితే అప్పుడు చత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ పదవిలో ఉన్నారు. ‘సీఎం ఢిల్లీ’కి 2013, సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు ఇచ్చినట్లు ఎంట్రీ ఉంది. అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఉన్నారు. ‘సీఎం ఎంపీ’ కి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యన పది కోట్ల రూపాయలను చెల్లించామని పత్రాల్లో ఎంట్రీ ఉంది. అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించిన చేసిందే అయితే అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌవాన్ ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ కోశాధికారి షైనా ఎన్‌సీకి 2013, సెప్టెంబర్ 10 నుంచి 2014, జనవరి 28 మధ్య ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఎంట్రీ ఉంది.
రాజకీయ పార్టీల పేర్లు....
ముడుపులు ఇచ్చినట్లు పేర్కొన్న సహార పత్రాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (యూ), రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ వికాస్ మోర్చా, తణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, భారతీయ కిసాన్ యూనియన్, శివసేన, లోక్ జనశక్తి పార్టీ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్ని 2013 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్యలో సహార గ్రూప్ సంస్థలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినప్పుడే బయటపడ్డాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని వెల్లడించలేదు. ఎందుకంటే, వాటిలో కాంగ్రెస్ పార్టీ పేరు, షీలాదీక్షిత్ పేర్లు ఉండడమేనని సులభంగానే ఊహించవచ్చు. అందుకని మోదీపై వచ్చిన ఆరోపణలను రాహుల్ గాంధీ అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ఢిల్లీ ప్రస్తుత సీఎం అరివింద్ కేజ్రివాల్ ప్రశ్నిస్తున్నారు.
మోదీపై రాహుల్ చేసిన అవినీతి ఆరోపణలను ముందుగా కేజ్రివాల్ చేసినవే. ఆయన నెలరోజులగా ఈ ఆరోపణలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ చేయడంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ దుమారం రేగుతోంది. ఐటీ అధికారుల్లో దొరికిన ఈ సహార పత్రాలు అసలువి కావచ్చు. కాకపోవచ్చు. కేవలం పత్రాల్లో పేర్లున్నంత మాత్రాన అవినీతి చేసినట్లు భావించలేమని సుప్రీం కోర్టే స్వయంగా భావించడం ఇక్కడ గమనార్హం. ఈ పత్రాలపై వచ్చే జనవరి 11వ తేదీన సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపాల్సి ఉంది. అసలు పత్రాలో, నకిలీ పత్రాలో కోర్టు నిర్ధారించాలి.
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన షీలాదీక్షిత్ పేరు కూడా పత్రాల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ, మోదీ పేరును ఎలా ప్రస్తావించారన్నది ఇక్కడ ఓ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ఇవ్వడమంటే షీలాదీక్షిత్‌కు ఇవ్వడమేనని రుజువైతే సమర్థించుకోవచ్చు. వ్యక్తిగతంగా రాహుల్‌కు వచ్చే నష్టం ఏమీలేదని, మోదీ పరువు ముందు షీలాదీక్షిత్ పరువు పోయినా ఫర్వాలేదని ఆయన భావించి ఉండవచ్చు. కోర్టు ముందు ఎలాగు కేసు నిలబడదు కనుక నిజాయితీ పరుడిగా ప్రజల్లో మోదీకున్న పేరును దెబ్బ తీయడమే అసలు లక్ష్యం కావచ్చు.