శశికళ వ్యూహం అదుర్స్.. గ్రాండ్ సక్సెస్!
చెన్నై: దేశంలో ఏ రాష్ట్రంలో చోటు చేసుకోని పరిణామాలు తమిళనాడులో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పీఠం అటూఇటూ కదిలి చివరకు చిన్నమ్మ చేతికే చిక్కింది. దీనిని దక్కించుకోవడంలో శశికళ చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా ముందుకు కదిలినట్లు తెలుస్తోంది. సీఎం బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం తాను ఒక ముఖ్యమంత్రిని అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోలేకపోవడం, పార్టీ బాధ్యతలు, ముఖ్యమంత్రి బాధ్యతలు ఒక్కరికే ఉండాలనే సంప్రదాయం అన్నాడీఎంకేలో ఉండటం శశికళకు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి.
అయితే, తమిళనాట రాజకీయాల్లో ఏఐఏడీఎంకేలో మరిన్ని మార్పులకు ఇదే పునాది అవ్వొచ్చు.. లేక భవిష్యత్తులో మార్పులకు ముగింపు పడొచ్చు. ఎక్కువమంది రాజకీయ నిపుణులు మాత్రం ప్రస్తుతం అసంతృప్తి ముసలం ఉండకపోయినా పదవి చివరికాలంనాటికి మాత్రం వేరుకుంపట్లు ఖాయం అని అంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలవడం.. అపోలో ఆస్పత్రిలోనే ఆమె కన్నుమూయడం.. చనిపోయిందన్న విషయాన్ని తొలుత ప్రకటించకుండా ముందుగా కొత్త సీఎంగా ఎవరనే అంశాలపై తర్జనల భర్జనలు చేసిన తర్వాత ఆమె మరణ వార్త ప్రకటన.. అర్ధరాత్రి సీఎంగా పన్నీర్ సెల్వం.. పార్టీ పగ్గాలు శశికళకు రావడం ఇదంతా కూడా శశికళ కనుసన్నల్లోనే జరిగిందని తాజా పరిణామాల ప్రకారం తెలుస్తోంది.
గతంలో ముఖ్యమంత్రి జయకు ఉన్నట్లుగానే శశికళకు కూడా పన్నీర్ సెల్వం అత్యంత విశ్వసనీయంగా ఉండేందుకే ప్రయత్నించారే తప్ప తన మంత్రి వర్గంలోవారిని ఆకట్టుకోవడం, ప్రజలను తన వైపునకు తిప్పుకోవడం వంటి చర్యలు చేయలేదు. పైగా మొన్నటి జల్లికట్టు సమయంలో కూడా పన్నీరు సెల్వం రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సమస్యలు విన్నవించుకోవడం చేశారు. అదే జయలలిత అయితే, కేంద్రం వద్దకు వెళ్లే సందర్భాలు చాలా అరుదు. సెల్వం చేసిన ఈ పని తమిళ ప్రజలకు రుచించనట్లు తెలుస్తోంది. అయితే, ఆయనను ఢిల్లీకి పంపించి ప్రజల వ్యతిరేకతను ఆయనపైకి.. సానుకూలతను తనవైపునకు మళ్లించుకునే చర్యలకే శశికళ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రం మద్దతుకోరుతూ ఆమె మోదీకి ఇటీవల లేఖలు రాసిన విషయం కూడా తెలిసిందే. పైగా ఏనాడు మీడియాతో మాట్లాడకుండా గందరగోళ పరిస్థితులు లేకుండా తన చుట్టూ ప్రశాంత వాతావరణం ఏర్పాటుచేసుకొని చాపకింద నీరులాగా తన వ్యూహాన్ని అమలుచేయించి తన మార్క్ శశికళ చూపించిందనే చెప్పాలి.
గత రెండు నెలలుగా స్తబ్ధంగా ఉన్నప్పటికీ ఈ రెండు నెలలు ఆమె క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతికూలతను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే చర్యలకు దిగినట్లు సమాచారం. మొత్తానికి తాజా నాటకీయ పరిణామంతో శశికళ అన్నా డీఎంకే పార్టీని, పార్టీ నేతలను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లపాటు జయలలితతో శశికళ సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయ ఆలోచనలే శశి కూడా అమలుచేస్తుంది పార్టీ శ్రేణులు ప్రజలు కూడా భావిస్తున్నట్లు సమాచారం.