చెన్నై: ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మిక్కిలి అనుచరురాలిగా ఉన్నారు. సాధకబాధలు పంచుకున్నారు. మంచిచెడులు విన్నారు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చి జయ దూరంగా పెట్టినా తిరిగి ఆమెనే స్వయంగా తీసుకొచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే జయ వ్యక్తిగత విషయాల నుంచి ఆస్తి వ్యవహారాల విషయాలు, ఆమె బలం బలహీనతలు సర్వం తెలిచిన వ్యక్తి శశికళ. అందుకే ఆమెను జయకు నిచ్చెలి అంటారు. జయ ఎక్కడ ఉంటే అక్కడ శశికళ ఉండాల్సిందే. జయకు ఎంతమంది తెలుసో దాదాపు అంతమంది శశికళకు తెలుసు.
సాధారణంగా ఇలాంటి క్రమపరిణామం వంశాపార రాజకీయాల్లో దర్శనం ఇస్తుంది. కానీ, జయ మాత్రం అలాంటిదానికి తావులేకుండా శశికళనే ఎప్పుడూ తన పక్కన పెట్టుకుని నేరుగా కాకపోయినా జనాలే జయ తర్వాత చిన్నమ్మే అనుకునేంతగా సంకేతాలు వెళ్లేలా చేశారు. అసలు తాను ఉండగా అధికార మార్పు దిశగా క్షణకాలం కూడా అనుమానపడని జయలలిత అనూహ్యంగా కాలం చేశారు. ఒక వేళ జయ కాలం చేస్తారనే విషయం ముందే తనకు తెలిసి ఉంటే సరిగ్గా అప్పటి నుంచే ఆమె వ్యూహాన్ని సిద్దం చేసిందని అనుకోవాల్సిందే. దూరంగా ఉన్న వ్యక్తికే సీఎం పదవిపై ఆశపుట్టడం సహజం.. అలాంటిది నేరుగా ఆ పదవిని దగ్గరుండి పరిశీలించిన వ్యక్తి శశికళ. ఆమె సీఎం పీఠాన్ని ఆశించకుండా ఉంటుందనుకోవడం అవగాహన రాహిత్యం అవ్వొచ్చు.
మరోపక్క, అమ్మ మరణం తర్వాత నేరుగా పార్టీ బాధ్యతలు, సీఎం బాధ్యతలు వేర్వేరుగా పెట్టారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అమ్మ చనిపోవడం, అంతకుముందు ఆరోగ్యంపై గందరగోళ ప్రకటనలు రావడం, అమ్మ మృతి వెనుక శశికళే ఉన్నారంటూ జయ మేనకోడలితో సహా పలువురునుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎంగా పన్నీర్ సెల్వంను ముందు పెట్టి తనను అనుమానిస్తున్నవారి దృష్టిని సమర్థంగా పక్కకు మరల్చగలిగారు. అంతేకాకుండా, తాను పార్టీ బాధ్యతల్లో ఉండి పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేసి పెద్దగా ఎలాంటి నిర్ణయాలు ఆయనను తీసుకోనివ్వలేదు.
ఇంకా చెప్పాలంటే ఆయన ఆలోచన పగ్గాలు తన చేతుల్లోకే తీసుకున్నారు. కేవలం ఆయన కదిలారంతే.. కానీ, ఈ కొద్ది రోజుల్లో ఆయన ఎక్కడికి కదిలినా ఆమె కనుసైగతోనే అది జరిగిందని సుస్పష్టం అవుతోంది. ఎందుకంటే, జయకు తెలిసినంత శశికళకు పన్నీర్ సెల్వం గురించి తెలుసు. అంతేకాకుండా, ఈ సమయంలో తప్ప మరోసారి శశికళ తమిళనాట రాజకీయాల్లో ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకొని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అది మరోసారి జరగాలంటే ఆమె విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ అండదండలు అందిస్తే అంతంతమాత్రంగ మాత్రమే. అప్పటికీ మరో కొత్త వ్యక్తి తమిళ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టకుంటే జరుగుతుంది. అయితే, భవిష్యత్ పరిణామాలు ఎట్లున్నా ప్రస్తుతానికి తనకు పూర్తి మద్దతు సహకారం అందించాలని ఆమె కేంద్రంలోని ప్రధాని మోదీ వంటి బీజేపీ పెద్దలతో రాయభారం కూడా నడిపినట్లు సమాచారం.
దాదాపు 30 ఏళ్లపాటు జయపక్కన కూర్చుని ఆ పదవీ వైభవాన్ని చూసిన చిన్నమ్మ తాను కూడా జీవితంలో ఒకసారి ముఖ్యమంత్రి అవ్వొచ్చని, దానికి ఇదే సమయం అని ఆలోచించి కూడా ఈ విషయంలో తన అనుభవాన్నంత ఉపయోగించిందని అనుకోవచ్చు. విద్యార్హతలు మినహాయిస్తే దాదాపు రాజకీయ అనుభవం ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ పరోక్షంగా మాత్రం శశికళకు ఉందని తాజా పరిణామాల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదేదో సామెతలో చెప్పినట్లు ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందాన.. జయకంటే మెరుగైన పాలన అందించి శశికళ తమిళ తంబీలను తనవైపునకు పూర్తి స్థాయిలో తిప్పుకొని అన్నాడీఎంకే పునాదులకు భద్రంగా కాపుకాస్తారేమో వేచి చూడాలి మరీ!
సీఎం కల నెరవేర్చుకుంటుందా.. పార్టీ కోసమా!
Published Sun, Feb 5 2017 4:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
Advertisement
Advertisement