
నూతన దంపతులతో ఈశ్వర్‌గౌడ (వృత్తంలో)
చింతామణి: ఇటీవల భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ మాజీ భర్త సమక్షంలోనే ప్రియున్ని పెళ్లాడారు. ఈ అరుదైన వివాహ ఘటన శుక్రవారం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది. చింతామణి పట్టణంలోని అశ్విని లేఅవుట్‌కు చెందిన రచనకు చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరగౌడతో 15 ఏళ్ల క్రితం వివాహమయింది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో భర్త ఈశ్వరగౌడ నుంచి విడాకులు తీసుకొని ఆమె బాబు, పాపతో విడిగా ఉంటున్నారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షరాలైన రచనకు ఆమె స్వయంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. రచన మాజీ భర్త ఈశ్వర్‌గౌడకు ఆమె విషయం చెప్పారు. మాజీ భర్త సహకారంతో రచన ఇంట్లోనే ఆమె, మంజునాథ్‌లు దండలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్త దంపతులు ఈశ్వరగౌడ ఆశీర్వాదం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.