మిథాలీ జట్టుకు భారీ నజరానా
ముంబై:మహిళల వన్డే వరల్డ్ కప్లో అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించిది. భారత మహిళా క్రికెటర్లను పురుషు క్రికెటర్లతో సమానంగా చూడటం లేదనే విమర్శల నేపథ్యంలో బీసీసీఐ కాస్త దిగివచ్చింది. భారత్ ను ఫైనల్ వరకూ చేర్చిన జట్టులో సభ్యులైన వారికి తలోరూ.50 లక్షలు నజరానా ఇవ్వనున్నట్లు శనివారం స్పష్టం చేసింది.
గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై గెలిచి భారత్ ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే మహిళా క్రికెటర్లకు నజరానా ఇస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.